చిన్నారి కడుపులో 'మెటల్' బాల్..!
కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ తో చాలాకాలం వైద్యం నిర్వహించారు. అయితే మందులకు ఏమాత్రం తగ్గకపోగా నొప్పి పెరుగుతుండటంతో చివరికి అనుమానం వచ్చి...ఎక్స్ రే తీయించారు. కడుపులో కనిపించిన బంతిలాంటి ఆకారం చూసి విస్తుపోయారు. ఎన్నో రకాల మెటల్ వస్తువులు, అయిస్కాంతాలు ఒక్కచోటికి చేరి పేరుకుపోవడమే చిన్నారి నొప్పికి కారణమని గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆయా వస్తువులను బయటకు తీశారు.
చిన్నపిల్లలు మట్టి, సుద్దముక్కలు వంటివి తినడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన మూడేళ్ళ బాలుడు ఏది కనిపిస్తే అది కడుపులో వేసుకున్నట్టున్నాడు. అందుకే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు అతడి పేగుకు చుట్టుకుపోయిన 29 అయిస్కాంతం ముక్కలు, ఓ బ్యాటరీ, ఓ కాయిన్ తోపాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులను బయటకు తీశారు. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని నెల క్రితం తల్లిదండ్రులు ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో అతడికి మొదటిసారి ఎక్స్ రే తీశారు. స్కానింగ్ లో అతడి కడుపులో పేరుకుని ఉన్న పెద్ద మెటల్ బాల్ లాంటి ఆకారాన్ని చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు.
ఫరీదాబాద్ మెట్రో హస్పిటల్ లోని లాప్రోస్కోపిక్ సర్జరీ హెడ్.. డాక్టర్ బ్రహ్మ దత్ పాఠక్... చిన్నారి కడపులోని వస్తువులను గుర్తించారు. సుమారు ఓ సంవత్సరం నుంచి బాలుడికి ఇటువంటి వస్తువులు తినే అలవాటు ఉన్నట్లుగా ఉందని... మాగ్నెట్లన్నీ ఓచోట చేరి బంతి ఆకారంలో మారి, చిన్నారి నొప్పికి కారణం కావడమే కాక, కడుపులోని ఇతర భాగాలను సైతం పాడుచేస్తుండటాన్ని డాక్టర్లు గమనించారు.
'ఇది చాలా సమస్యాత్మకమైన కేసు. అయస్కాంతాలన్నీ చుట్టుకుపోవడం వల్ల చిన్నారి పేగు పూర్తిగా పాడైపోయింది. శస్త్ర చికిత్స చేయడానికి సుమారు మూడు గంటలు పట్టింది. మా వైద్య బృందం అంతా కలిసి ఆ చిన్ని పొట్టనుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు తీస్తూనే ఉన్నాం.' అని డాక్టర్ పాఠక్ చెప్పారు.
చిన్నారి కుటుంబ సభ్యులు జ్యువెలరీ బాక్స్ లు తయారు చేసే వ్యాపారం ఇంట్లోనే చేస్తుంటారని, దీంతో నేలపై పడిన ప్రతి వస్తువునూ చిన్నారి తినేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. మెటల్ వస్తువులు అతి చిన్నవిగా ఉంటే రోజువారీ కాలకృత్యాల్లో బయటకు వెళ్ళిపోయి ఉండేవని, పెద్దవిగా ఉండటంతో కడుపులోనే పేరుకు పోవడంతో.. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు.
ఇప్పటికైనా పేగు చాలాశాతం తినేయడంవల్ల చిన్నారి ఎక్కువకాలం నొప్పితో బాధపడే అవకాశం ఉందని, తగ్గడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులు కూడ అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ అతడికి అందకుండా జాగ్రత్త పడుతున్నారు.