సచిన్ పార్లమెంట్‌లో క్రీడలపై ఎన్ని ప్రశ్నలు వేశారు?
క్రీడలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాల్సిన బాధ్యత వీరిపై ఇతర ఎంపీలకన్నా ఎక్కువగా ఉంటుంది. మరి వీరిలో ఎంత మంది తమ బాధ్యతలను, ఎలా నిర్వర్తించారో ఒకసారి పరిశీలించగా, నలుగురు ఎంపీలు కలిసి ఇంతవరకు ఎనిమిదంటే ఎనిమిదే క్రీడలకు సంబంధించిన ప్రశ్నలను సంధించారు. క్రీడలు, యువజన సర్వీసులకు సంబంధించి ఎంపీలందరూ కలసి మొత్తం 460 ప్రశ్నలు వేయగా, వీరి ఎనిమిది ప్రశ్నలను మాత్రమే వేశారంటే వారి బాధ్యతారాహిత్యం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
1. సచిన్ టెండూల్కర్: రాజ్యసభ సభ్యుడైన మాజీ క్రికెట్ దిగ్గజం ఈరోజు వరకు సభలో 14 ప్రశ్నలు వేయగా, అందులో నాలుగు మాత్రమే క్రీడలకు సంబంధించినవి ఉన్నాయి. మాజీ క్రీడాకారాలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, క్రీడలను విద్యా పాఠ్యాంశంగా తప్పనిసరి చేయడం, యోగాను కూడా పాఠ్యాంశంగా మార్చడం, స్టేడియంలు, క్రీడా మైదానాలను సద్వినియోగం చేయడానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలను మాత్రమే ఆయన రాజ్యసభలో లేవనెత్తారు.
2. కీర్తి ఆజాద్: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని బహిరంగంగా విమర్శించినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన లోక్‌సభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మిగతా నాలుగు ప్రశ్నలను సంధించారు. దేశంలో హాకీ మేనేజ్‌మెంట్, దివ్యాంగుల్లో క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలకు ఆర్థిక సహకారం అందించడం, బీసీసీఐ, ఐపీఎల్‌లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఆయన ఈ నాలుగు ప్రశ్నలు వేశారు.
3. ప్రసూన్ బెనర్జీ : మాజీ భారత ఫుట్‌బాల్ ప్లేయర్, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు ప్రసూన్ బెనర్జీ ఇంతవరకు క్రీడలకు సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు.
4. మేరి కోమ్: రాజ్యసభకు నామినేట్ అయిన మేరి కోమ్ ఒలింపిక్స్‌లో రజిత పతకాన్ని గెలుచుకున్న విషయం తెల్సిందే. గత ఏప్రిల్‌లోనే ఆమె నామినేట్ అయినా ఇంతవరకు ఎలాంటి ప్రశ్న వేయలేదు.
పైగా వీరిలో ఒక్కరు కూడా క్రీడలకు సంబంధించిన స్థాయీ సంఘంలో సభ్యులు కాకపోవడం మరింత విచిత్రం. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘంలో కీర్తి ఆజాద్ సభ్యులుకాగా, సమాచార, సాంకేతిక రంగానికి సంబంధించిన స్థాయీ సంఘంలో సచిన్ టెండూల్కర్, ప్రసూన్ బెనర్జీలు సభ్యులు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్థాయీ సంఘంలో మేరీ కోమ్ సభ్యులు.