వేర్పాటువాదులతో చర్చలు లేవు
కశ్మీర్ సమస్యపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
- చట్టబద్ధంగా అర్హత కలిగిన వారితోనే సంప్రదింపులు
న్యూఢిల్లీ: రావణకాష్టంలా రగులుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి వేర్పాటువాదులు లేదా స్వాతంత్య్రం(ఆజాదీ) కావాలని డిమాండ్ చేసే వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చట్టబద్ధంగా అర్హత కలిగిన రాజకీయ పార్టీలు, వ్యక్తులతో సంప్రదింపులు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అభిప్రాయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. అటార్నీ జనరల్ చెప్పిన అంశాలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నందున చట్టానికి లోబడి నడుచుకునే వారంతా సమావేశమై చర్చించి.. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో తమ ముందుకు రావాలని సూచించింది. అనేక మంది మృతికి, గాయపడ్డానికిS కారణమైన పెల్లెట్ గన్ల నిషేధానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న జమ్మూకశ్మీర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్మాణాత్మక సూచనలతో బార్ అసోసియేషన్ తమ ముందుకు వస్తేనే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొంది. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ముందు సంబంధిత వర్గాలతో సంప్రదింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాళ్లు రువ్వే ఘటనలు, వీధుల్లో హింసాత్మక ఆందోళనలు ఆగిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు వేర్పాటువాదులకు చర్చల ప్రక్రియలో చోటు కల్పించాలన్న బార్ అసోసియేషన్ ప్రతిపాదనను అటార్నీ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్ స్వాతంత్య్రంపై ప్రశ్నలు సంధిస్తూ.. గృహ నిర్బంధంలో ఉన్న పలువురు వేర్పాటువాద నేతల పేర్లను అఫిడవిట్‌లో ప్రస్తావించడం ద్వారా బార్ అసోసియేషన్ ఈ అంశానికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ధర్మాసనం కలుగజేసుకుంటూ తాము సంప్రదింపుల ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నామని, దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే విచారణను ఇప్పుడే ముగిస్తామని కేంద్రానికి స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలు, రాళ్లు రువ్వడం వంటివి ఆగిపోతాయని హామీ ఇస్తే పెల్లెట్ గన్ల వినియోగం నిలిపివేయాలని ఆదేశాలిస్తామని బార్ అసోసియేషన్‌కు తెలిపింది. అయితే రాష్ట్రంలోని అందరి తరఫున తాము హామీ ఇవ్వలేమని చెప్పడంతో.. న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో సాధారణ స్థితి ఏర్పడేందుకు ఇరు వర్గాలు ఉమ్మడిగా ముందడుగు వేయాలని, తొలి అడుగు వేయాల్సింది బారే అని, ఇదే వారికి చివరి అవకాశమని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే బార్ అసోసియేషన్ పాత్రే కీలకమని, ఇందుకు వారు సిద్ధపడితే చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను మే 9వ తేదీకి వాయిదా వేసింది.