'తప్పదు.. భారత్కు వేరే మార్గం లేదు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్తో చర్చలు తప్ప మరొక మార్గం లేదని, చర్చల నుంచి భారత్ తప్పించుకోలేదని జమ్మూకాశ్మీర్ లో బీజేపీ భాగస్వామి పీడీపీ పేర్కొంది. ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం వణికిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మాటామంతి జరుపుకోవాల్సిందేనని పీడీపీ అధ్యక్షుడు మహబూబా మఫ్తీ అన్నారు. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా, తాలిబన్ వంటి సంస్థలు ఉగ్రవాదంతో కలవరపెడుతున్నాయని, దానినుంచి బయటపడాలంటే ఇప్పటికైనా భారత్ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో చేతులు కలపాల్సిందేనని చెప్పారు.
గత నవంబర్ 7న శ్రీనగర్ లో ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా కాశ్మీర్ విషయంలో ఎవరి సలహాను తీసుకోకపోవడంపై ఆమెను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ప్రజలకు అనుభవం ద్వారా కొన్ని విషయాలు తెలిసి వస్తాయని, జమ్ముకాశ్మీర్ విషయం మిగితా రాష్ట్రాల మాదిరిగా కాదనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాల సరిగా లేకుంటే, సరైన చర్చలు జరపకుంటే ఆ ప్రభావం నేరుగా దేశంపై పడుతుందని చెప్పారు. సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనకు వెళ్లి మంచి సందర్బానికి తెరతీశారని అన్నారు.