పార్టమెంట్ లో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే పెదవి విరిచారు. ఈ సాధారణ బడ్జెట్ లో సామాన్యులకు ఎటువంటి ఉపశమనం లేదని ఆరోపించారు.
పార్టమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పెదవి విరిచారు. ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఎటువంటి ఉపశమనం లేదని అన్నారు. ఎట్టకేలకు పారిశ్రామికవేత్తలకు కాస్త ఉపశమనం కలిగేలా చూశారని చిరకాలంగా ఉన్న రైతుల రుణమాఫీ డిమాండ్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.
బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగేందుకు ఏమాత్రం ఉపయోగపడిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధి హామీకి 40,000 కోట్లు ఇచ్చిందన్నారు. దాంతో పోలిస్తే ఈ బడ్జెట్ పెద్ద విషయమేమీ కాదన్నారు. మొత్తం కేటాయింపులు ఎంత పెరిగాయన్నది ముఖ్యం కాదని, వేతనాల్లో ఎంత పెరిగిందన్నది పోల్చి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజుకూలి 100 రూపాయలు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం 40 వేల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోజు కూలి 150కి మారిందని అన్నారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఒక్క డబ్బు విషయాన్నే పరిగణలోకి తీసుకుందని, భౌతిక భాగాన్ని పరిశీలించలేదని ఖర్గే విమర్శించారు. ముఖ్యంగా బడ్జెట్లో మహిళలు, యువతకు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదంటూ ఆరుణ్ జైట్లీ బడ్జెట్ పై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు.