సాక్షి, రోహతక్ : హర్యానాలోని డేరా సచ్ఛా సౌధలో శనివారం దొంగలు పడ్డారు. దొరికిన విలువైన వస్తులును చేజిక్కించుకుని పారిపోయారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని దొబాడలో ఉన్న డేరాలో దొంగలు శనివారం చొరబడ్డారు. గుర్మీత్ విలువైన దుస్తులు, బూట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు డేరా అధికారులు చెబుతున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో ప్రధానంగా సీసీటీవీలు, కంప్యూటర్, పరుపులు, పలు హార్డ్ డిస్క్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ తరువాత.. డేరా కార్యాలయాల దగ్గర ప్రభుత్వం అత్యంట పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాక డేరాకు కూడా సొంత సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఇటువంటి భద్రత మధ్య దొంగలు డేరాలోకి ప్రవేశించడపై పోలీసులు, అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు రోహ్‌తక్ రేంజి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవదీప్ విర్క్ తెలిపారు.