భారత్ లో పారిశుద్ధ్యం కోసం కిలిమంజారో ఎక్కాడు!
భారతదేశంలోని పాఠశాలల్లో పారిశుధ్య సౌకర్యాలే లక్ష్యంగా అతడు నడుం బిగించాడు. విద్యార్థుల అవస్థలు తీర్చేందుకు సిద్ధపడ్డాడు. అందుకు సొమ్ము సమకూర్చుకోడానికి పర్వతారోహణ ప్రారంభించాడు. ఇండో కెనడియన్ వ్యాపారవేత్త గిరీష్ అగర్వాల్ ఫిబ్రవరి 29న ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ఎక్కి రూ. 40 లక్షల నిధులు సేకరించాడు. 'సమిట్ ఫర్ డిగ్నిటీ పేరున' ప్రచారం చేపట్టి ఇండియాలోని పాఠశాల విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనకు పూనుకున్నాడు.
పాఠశాల వయసు నుంచే పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహనతో పాటు, మంచి అలవాట్లను పెంపొందించాలన్న ఉద్దేశంతో గిరీష్ అగర్వాల్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలోని 60 కోట్ల మంది ప్రజలు పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ పాఠశాలల్లో ఈ సమస్య మరింతగా ఉంది. సుమారు 45 శాతం స్కూళ్లలో మౌలిక సమదుపాయాలు లేవు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున ఉన్నాయి. ఒక్కో స్కూల్లో సుమారు 250 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అనేక ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. డ్రాపవుట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క జంషెడ్ పూర్ లోనే 200 మంది విద్యార్థినులు మౌలిక సదుపాయాల లేమి కారణంగా డ్రాపవుట్స్ గా మారారు. ఈ విషయంపై దృష్టి సారించిన అగర్వాల్ నిధుల సేకరణ కోసం పర్వతారోహణ ప్రారంభించాడు. అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమే అయినా.. ఛాలెంజింగ్ గా తీసుకున్న అగర్వాల్ 5900 మీటర్ల ఎత్తైన పర్వతం కిలిమంజారో అధిరోహించాడు.
పర్వతారోహణకు కావలసిన ఆరోగ్యం కోసం అగర్వాల్ కఠిన నియమాలు పాటించాడు. అందుకు తనకు భార్య శృతి, స్నేహుతులు ఎంతో సహకరించారని చెప్తున్నాడు. ముంబైలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన అగర్వాల్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి వ్యాపారవేత్తల్లో టాప్ 25 గా నిలవడమే కాక, కెనడా వలస పెట్టుబడిదారుల గ్రూప్ గోల్డ్ మెడలిస్ట్ అవార్డును కూడా అందుకున్నాడు. తాను పేదరికంలో పుట్టినా, అయితే తన తల్లిదండ్రులకు ఇరుగు పొరుగులు, బంధువులు సహకరిచండంతో చదువుకోగాలిగానని, అందుకు కృతజ్ఞుడినని అగర్వాల్ చెబుతున్నాడు. వివిధ దేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వీలుగా అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న అగర్వాల్... ఇళ్ళల్లో లక్ష మరుగుదొడ్లు, సూళ్ళలో 528 టాయిలెట్ బ్లాకులు, అలాగే 26 కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్సుల నిర్మాణం కోసం రూ. 1.67 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన ఫండ్ రైజర్ పేజిలో రాశాడు. అందుకోసం ఒక్కో పర్వతం ఒక్కోసారి ఎక్కి తన కల నెలవేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు.