ఆ ముఖానికి నల్లరంగు ఎందుకు? | This Kochi artist has been painting her body black to fight dark skin bias | Sakshi

ఆ ముఖానికి నల్లరంగు ఎందుకు?

Published Thu, Apr 7 2016 2:26 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

ఆ ముఖానికి నల్లరంగు ఎందుకు? - Sakshi

ఆ ముఖానికి నల్లరంగు ఎందుకు?

కొచ్చి: నగరానికి సమీపంలోని త్రిపునితురలో నివసిస్తున్న ఆర్టిస్ట్ పీఎస్ జయ ప్రతి రోజు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ముఖానికి, కాళ్లకు, చేతులకు నల్లటి రంగు పూసుకుంటోంది. బస్కెక్కుతోంది. నేరుగా ఓ ప్రైవేటు ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి అక్కడ పిల్లలకు పాఠాలు చెబుతోంది. బయటకు రాగానే అలాగే బంధు మిత్రుల ఇంటికి వెళుతోంది. అటు నుంచి స్నేహితుల వద్దకు... వారితో కలసి రెస్టారెంట్‌కు వెళుతోంది. అలా...అలా...నలుగురితో మాటా మంతి కలిపి ఎప్పటికో ఇల్లు చేరుతోంది. ఆమె గత 70 రోజుల నుంచి క్రమం తప్పకుండా ఓ దిన చర్యగా ఇది చేస్తూ వస్తోంది.

ఎందుకు నల్ల రంగు వేసుకొని తిరుగుతున్నావని ఎవరైనా అడిగితే వారితో వాదనకు దిగుతుంది. మనుషులు నల్లగా ఉంటే తప్పేంటి? నల్లవారి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ముఖ్యంగా నల్లగా ఉండే దళితుల పట్ల ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారు? అని ప్రశ్నిస్తుంది. భారత్‌లో అనాది కాలంగా కొనసాగుతున్న కుల వ్యవస్థ గురించి కడిగేస్తుంది. ఇలా ప్రశ్నించడమే కాకుండా ఎదుటి వారి అభిప్రాయాలను, భావాలను పూసగుచ్చినట్లు తెలుసుకుంటుంది. వారిలో కుల వ్యవస్థ గురించి అవగాహన పెంచేందుకు, వీలైనంత మేరకు వారిలో చైతన్య భావన కలిగించేందుకు కృషి చేస్తోంది. తనకు తారసపడ్డ అందరి అభిప్రాయాలను వీడియోలో రికార్డు చేస్తోంది. వారి ఫొటోలను తీసుకుంటున్నది.

వీటన్నింటిని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసేందుకు ప్రయత్నిస్తోంది. శాస్త్రవిజ్ఙానపరంగా, ఆర్థికంగా భారత్ ఎంతో ఎదుగుతున్నప్పటికీ సామాజికంగా ఇంకా ఎందుకు ఎదగడం లేదన్నది ఆర్టిస్జ్ జయ బాధ. తెలుపు, నలుపు, అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు, మగవాళ్లు, ఆడవాళ్లు అన్న వివక్షలేని సమాజం ఏర్పడాలన్నది ఆమె తపన. అందుకే నలుపు రంగు పూసుకునే వినూత్న కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని వంద రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నానని, జనవరి 26న ప్రారంభించిన ఈ కార్యక్రమం మే 5వ తేదీతో ముగుస్తుందని ఆమె మీడియాకు తెలిపింది.

దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో తాను కదిలిపోయానని, దళిత వివక్ష కారణంగానే అతన్ని సమాజం బలితీసుకుందని, అలాంటి వివక్షకు వ్యతిరేకంగా పోరాడడమే తన కర్తవ్యమని జయ వివరించారు. తన ప్రస్తుత కార్యక్రమం ముగిశాక దళితులపై ఓ ప్రత్యేక కేలండర్‌ను తీసుకొస్తానని, అందులో దళితుల పండుగల వివరాలతో పాటు చరిత్రలో దళిత ఉద్యమాలకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తానని ఆమె చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement