నా నోరు ఎవరూ మూయించలేరు: సీఎం
ప్రస్తుతం దేశంలో ఉన్న అసహనం, విభజన రాజకీయాల మధ్య పశ్చిమబెంగాల్ మాత్రమే పోరాడి దేశాన్ని కాపాడగలదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ వాళ్లు తనను బెదిరించి, భయపెట్టి తన నోరు మూయించలేరని చెప్పారు. బిహార్, మహారాష్ట్ర లాంటివి భయపడి ఊరుకుంటాయేమో గానీ తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం ఆపేది లేదని చెప్పారు. కేవలం బెంగాల్ మాత్రమే ఈ మత రాజకీయాలపైన, అసహనంపైన పోరాడి దేశాన్ని కాపాడుతుందని బుద్ధపూర్ణిమ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని, తాను జైలుకు వెళ్లినా సరే అక్కడినుంచి కూడా బీజేపీపై పోరాడతాను తప్ప తుదివరకు ఆపేది లేదని స్పష్టం చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల పేరును ప్రస్తావించకుండానే ఆ ఘటనపైనా విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కదా అని ఇతరులు ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పే హక్కు ఉండదని, అసలైన మతం ఇది కాదని ఆమె అన్నారు. మతం మనకు రాజకీయాలు చేయమని గానీ, ప్రజలను చంపమని గానీ చెప్పదని.. మతం అంటే విశ్వాసం, శాంతి, ప్రేమ, సోదరభావం అని చెప్పారు. బీఫ్, గోవధ అంశాలపై రాజకీయాలు జరుగుతున్నాయని కూడా మమత విమర్శించారు. తనను కొంతమంది బీజేపీ నేతలు హిజ్రా అన్నారని.. అది సిగ్గుచేటని, తాను చెడ్డమనిషిని కావచ్చు గానీ, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు తనకుందని చెప్పారు.