![threat of nuclear and chemical weapons falling in the hands of terrorists can be disaster, says Bipin Rawat - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/17/Rawat.jpg.webp?itok=9aXzJEdi)
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటం మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అవకాశముందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటూ అంతర్జాతీయ సరిహద్దులను అధిగమించి చొచ్చుకువస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులనే కాదు.. వారిని ప్రోత్సాహిస్తూ స్పాన్సర్లుగా ఉన్న వారిని సైతం చెదరగొట్టాల్సిన అవసరముందని, ఉగ్రవాదులకు స్పాన్సర్లుగా ఉన్న దేశాలను గుర్తించాలని సూచించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ‘రైజినా2018’ సదస్సులో ఆర్మీ చీఫ్ రావత్ మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, మిలిటెంట్లకు ఉన్న లింకులను తొలగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై కొంతమేరకు ఆంక్షలు విధించాల్సిన అవసరముందని, ప్రజాస్వామిక దేశాల ప్రజలు దీనిని అంగీకరించకపోయినా.. భద్రమైన వాతావరణం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని రావత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment