కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, మమతా బెనర్జీ పార్టీలో క్రియాకీలక నేత హఠాన్మరణం...
సాక్షి, కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సుల్తాన్ అహ్మద్ కన్నుమూశారు. 64 ఏళ్ల సుల్తాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రాగా ఆయన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర టూరిజం శాఖ సహయ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
టీఎంసీలో మైనార్టీ ముఖచిత్రంగా అహ్మద్‌ను పేర్కొంటారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎంటల్లీ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1997లో మమతాబెనర్జీతో తృణముల్ కాంగ్రెస్ ను స్థాపించటంలో ఆయన ముఖ్యభూమిక పోషించారు.
2014 ఎన్నికల్లో ఉలుబేరియా నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. నారదా స్టింగ్ కేసులో అహ్మద్ నిందితుడిగా ఉన్నారు. కాగా, ఆయన మృతిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.