ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు చేపడతారు. ఈ నేపథ్యంలో పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇరు రైల్వే పీఆర్వోలు ఒక ప్రకటనలో తెలిపారు.
సెంట్రల్‌లో...
కళ్యాణ్-ఠాణే అప్ ఫాస్ట్ ట్రాక్‌పై మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో ఈ ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను కల్యాణ్ నుంచి ఠాణే వరకు స్లో ట్రాక్‌పై నడుపుతారు. ఈ సమయంలో రైళ్లు ఠాణే వరకు అన్ని స్టేషన్లలో హాల్ట్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లిస్తారు. ఇదిలా ఉండగా ఫాస్ట్ లైన్లలో నడిచే రైళ్లు ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్ స్టేషన్లలో అదనంగా హాల్ట్ చేయనున్నారు. ఈ సమయంలో రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.
హార్బర్‌లో...
హార్బర్ మార్గంలో సీఎస్టీ-కుర్లా డౌన్, వడాలారోడ్-బాంద్రా అప్-డౌన్ లైన్లలో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. సీఎస్టీ-బాంద్రా/అంధేరి సేవలు రద్దు చేయనున్నారు. డౌన్ లైన్‌లో సీఎస్టీ నుంచి బయలుదేరే లోకల్ రైళ్లను బైకలా వరకు మెయిన్ లైన్‌లో నడుపుతారు. ఈ సమయంలో సదరు రైళ్లు అన్ని స్టేషన్లలో హాల్ట్ అవుతాయి. రైళ్లు 10 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. బాంద్రా, అంధేరిలకు వెళ్లే హార్బర్ లైన్ ప్రయాణికులు మెయిన్ లైన్ లేదా పశ్చిమ రైల్వే మార్గంలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
నేడు సెంట్రల్, హార్బర్ మార్గాల్లో మెగాబ్లాక్
Published Sat, Nov 22 2014 10:56 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement