సాక్షి, ముంబై: ప్రభుత్వ అనాథ శరణాలయాల్లోని చిన్నారుల పౌష్టికాహారం కోసం కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతున్నా, వారికి కనీస పరిమాణంలో పోషక పదార్థాలు దొరకడం కూడా కష్టమేనని తేలింది. మహారాష్ర్టతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో 52 శాతం మంది అనాథ చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.
వీరికి పారిశుద్ధ్యం, మంచి దుస్తులు కూడా కరువేనని వెల్లడయింది. ఉదాహరణకు.. పుణేలోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్న తొమ్మిది ఏళ్ల శివం బరువు కేవలం 15 కిలోలు మాత్రమే. వైద్య ప్రమాణాల ప్రకారం ఈ వయస్సు బాలుడు కనీసం 28 కిలోల వరకు బరువు ఉండాలి. శివం గత మూడేళ్లుగా పుణేలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లో ఉంటున్నాడు. ఇతడి మాదిరిగానే రాష్ర్టంలో వేలాది మంది అనాథబాలలకు పోషకాహారం అందుబాటులో లేకపోవడం తో ఎదుగుదల లోపించడం, అనారోగ్యం బారిన పడడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది.
మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశాలో సేవలు అందిస్తున్న ‘క్యాథలిక్ ఫర్ సోషల్ యాక్షన్’ (సీఎస్‌ఏ) అనే సామాజిక సేవాసంస్థ అనాథ చిన్నారుల జీవితాలపై నిర్వహించిన అధ్యయనం ద్వారా పైవిషయాలు బయటికి వచ్చాయి. ఆరు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న 1,412 మంది అనాథలపై ఈ సర్వే నిర్వహించినట్టు సీఎస్‌ఏ వర్గాలు తెలిపాయి. వీరిలో 26 శాతం మంది మధ్యస్తంగా పోషకాహారం లోపంతో ఉన్నారని గుర్తించగా, మరో 26 శాతం మంది బాలలు స్వల్పంగా పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించారు.
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన పదార్థాలు అందిచకుంటే ఏ సమయంలోనైనా తీవ్ర అనారోగ్యానికి గురికావొచ్చని సీఎస్‌ఏ డెరైక్టర్ సిడ్నీరోచా అభిప్రాయపడ్డారు. అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న అత్యధిక చిన్నారులకు తండ్రి లేదా తల్లి (సింగిల్ పేరెంట్) మాత్రమే ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉండి కూడా పిల్లలను పోషించలేక ఇక్కడ వదిలేసిన వారూ ఉన్నారని తేలింది. శివం తండ్రి ఓ తాగుబోతు కాగా, తల్లి కూలీ పని చేస్తుంటుంది. దీంతో ఈ దంపతులు తమ కొడుకుని పోషించే స్తోమత లేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్లారు. ‘డబ్బులు లేక శివం ఎన్నోసార్లు పస్తులు ఉన్నాడు. ఇతనికి మూడు పూటల సరైన భోజనం అందజేస్తే శరీరం ఎదిగే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎదుగుదలలో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు’ అని రోచా అన్నారు.
చాలీచాలని నిధులు..
మహారాష్ట్రలోని చాలా అనాథ శరణాలయాలకు సమగ్ర శిశుసంరక్షణ పథకం కింద నిధులు అందుతున్నాయి. అంతేగాక ఈ ఏడాది నుంచి ప్రతి చిన్నారిపై వెచ్చించాల్సిన ఖర్చు మొత్తాన్ని కూడా రూ.650 నుంచి రూ.రెండు వేలకు పెంచినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా వుండగా అనాథ శరణాలయాల నిర్వాహకులు మాత్రం తమకు ఈ నిధులను సక్రమంగా అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. పెంచిన మొత్తాలను కూడా విడుదల చేయడం లేదని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిశుసంరక్షణ పథకానికి రూ.62.7 కోట్లు కేటాయించారు.
ఈ నిధుల ద్వారా సరఫరా చేస్తున్న వాటిలో పోషక పదార్థాలు ఉండడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లో పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వడం లేదని సీఎస్‌ఏ సమన్వయకర్త అనుపమ్ శుభదర్శన్ పేర్కొన్నారు. అనాథ పిల్లల్లో పరిశుభ్రత, మంచి అలవాట్లు లోపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ‘చాలా మంది పిల్లలకు రెండు లేదా మూడు జోళ్ల దుస్తులు మాత్రమే ఉంటున్నాయి. దుస్తులు సరిగ్గా లేని వాళ్లు తడి బట్టలనే తొడుక్కోవడంతో చర్మ వ్యాధులు సోకుతున్నాయి. అంతేకాకుండా వీరి ఒంటిపై తెల్లటి మచ్చలు కూడా వస్తున్నాయి’ అని వివరించారు.
అనాథల ఆక్రందన
Published Sun, Aug 17 2014 11:11 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement