‘నాకుంది 12మంది ఎంపీలే.. నేనెలా రాష్ట్రపతిగా..’
ముంబయి: తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకొస్తానని అనవసరం ప్రచారం చేయొద్దని, అలాంటి ఊహాగానాలకు తెరదించాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. పద్మ విభూషణ్ పురస్కారం పవార్‌కు దక్కిన నేపథ్యంలో ఆయనను కలిసిన మీడియాలో పలు విషయాలు మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా.. ‘కేవలం పన్నెండు మంది ఎంపీలను కలిగిన ఓ వ్యక్తి అంత పెద్ద స్థాయిని(రాష్ట్రపతి హోదా) ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరాదు.
లోక్ సభలో, రాజ్యసభలో నా బలమెంతో నాకు బాగా తెలుసు. మొత్తం కలిపి నా దగ్గర ఉందే 12మంది ఎంపీలు. వారి సహాయంతో అది ఆశించకూడదు’ అని స్పష్టం చేశారు. ఇక ప్రధాని పదవిపై ఆయనకున్న శక్తి సామర్థ్యాలను ప్రశ్నించగా దేశంలో అలాంటి శక్తి గలవారు చాలామంది ఉన్నారని, అయితే, వారిలో ఒకరికి రాజకీయ శక్తిసామర్థ్యాలు అవసరం అని అన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూడరని, రాజకీయ బలమే ముఖ్యం అని అన్నారు. తనకు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డును రైతులకు అంకితం ఇస్తున్నాని చెప్పారు. మొత్తం దేశానికి తాను చేసిన సేవలు గుర్తించే ఈ పురస్కారం లభించిందని తాను భావిస్తున్నానని అన్నారు.
76 ఏళ్ల తాను రాజకీయ క్షేత్రంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నానని, ఇది దేశం మొత్తం గుర్తించాల్సిన అంశం అన్నారు. దేశంలో దేశం వెలుపలా చేసిన అద్భుత కృషికి తనకు ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు దక్కిన విషయం గుర్తు చేశారు. కానీ, తనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.