2019 ఇండియా టాప్‌టెన్‌.. | Top 10 Upcoming Events In 2019 In India | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 1 2019 4:47 AM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

Top 10 Upcoming Events In 2019 In India - Sakshi

2018 వెళ్లిపోయి కొత్తసంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2019 వివిధ రంగాల్లో ఆశావహంగా కనబడుతుంటే.. మరికొన్ని రంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరికొన్ని చర్చనీయాంశం అవుతున్నాయి. అన్నింటికీ మించి ఇది ఎన్నికల సంవత్సరం. అందుకే.. రాజకీయ పార్టీలన్ని అజెండాలు, కూటముల రూపకల్పనలో తలమునకలవుతున్నాయి. కేంద్రంలో ఎవరు పాగా వేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వాల ఆర్థిక నిర్ణయాలు జనాల జేబులు నింపుతాయా? లేక చిల్లులు పెడతాయా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆరోగ్య భారత్‌ కల సాకారమవ్వాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. సాంకేతిక రంగంలో అనుకున్న మాదిరిగానే దూసుకెళ్తున్నాం. దాయాది దేశంతో సఖ్యత ఎండమావేనని గతేడాది పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. క్రీడారంగంలో 2018లో సాధించిన విజయాల పరంపర ఈసారీ కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.  కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ వివిధ రంగాల భవిష్యత్తుపై ఓ విశ్లేషణ. 

మోదీ మళ్లీ గెలుస్తారా?
వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం పూర్తిగా మోదీ కేంద్రంగానే జరుగుతున్నాయి. మోదీ అనుకూల, మోదీ వ్యతిరేక కూటముల మధ్యే ప్రధానంగా పోరు ఉండబోతుందనేది సుస్పష్టం.
చాయ్‌వాలా స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగరేసి రెండోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తారా లేక ‘పునరుజ్జీవ ’కాంగ్రెస్‌కు దారిస్తారా? అనే అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2014 తర్వాత మోదీ ‘రాజకీయ చాణక్యం’తో దేశంలో ఒక్కో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటూ బలమైన శక్తిగా తయారైంది. దీంతో జాతీయంగా, అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. అయితే.. దేశంలో వ్యవసాయంతోపాటు పలు రంగాల్లో ఎదురవుతున్న సమస్యలతో.. మోదీ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం పూర్తిగా మోదీ కేంద్రంగానే జరుగుతున్నాయి. మోదీ అనుకూల, మోదీ వ్యతిరేక కూటముల మధ్యే ప్రధానంగా పోరు ఉండబోతుందనేది సుస్పష్టం. అటు కాంగ్రెస్‌ కూడా ఎలాగైనా మోదీని గద్దెదించాలని అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలకు చెక్‌పెట్టి.. ప్రజామోదాన్ని మోదీ పొందగలరా? లేదా? అనేదే భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.  

ఈ ఏడాదేనా 5ఎ
అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, జపాన్‌లలో 5జీ ఈ ఏడాదే అందుబాటులోకి వస్తోంది. ఈ తాత్కాలిక ఏర్పాటు వల్ల ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ఇంటర్నెట్‌ వేగం సెకనుకు రెండు గిగాబైట్ల స్థాయికి చేరుకోవచ్చునని అంచనా. 
సాంకేతిక ప్రపంచం ఎదురుచూస్తున్న 5జీ టెక్నాలజీ ఈ ఏడాది అమల్లోకి వస్తుందనే అంచనాలున్నాయి. అయితే ఇది భారత్‌లోనూ అందుబాటులోకి వస్తుందా? లేదా.. ఇంకొంత ఆలస్యమవుతుందా అన్నదానిపై స్పష్టత రాలేదు. స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నెట్‌ వేగాన్ని 4జీ స్థాయికి పదింతలు చేయగల 5జీ టెక్నాలజీకి అవసరమైన స్పెక్ట్రమ్‌ కేటాయింపులు మన దేశంలో ఇంతవరకూ జరగకపోవడమే ఇందుకు కారణం. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా స్పెక్ట్రమ్‌ వేలం జరిగే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. జియో, ఎయిర్‌టెల్‌ వంటి కంపెనీలు స్పెక్ట్రమ్‌ వేలంతో సంబంధం లేకుండా 5జీ వేగాలను అందించే అవకాశం ఉంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్‌లలో 5జీ ఈ ఏడాదే అందుబాటులోకి వస్తోంది. ఈ తాత్కాలిక ఏర్పాటు వల్ల ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ఇంటర్నెట్‌ వేగం సెకనుకు రెండు గిగాబైట్ల స్థాయికి చేరుకోవచ్చునని అంచనా. 

ఎజెండాపై అన్నదాత
అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో ‘అన్నదాత’పై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ఇందులో రైతు రుణమాఫీపై ప్రధాన అజెండాగా మారింది. రుణమాఫీ బదులు రైతులకు అవసరానికి ఆర్థిక సాయం అందించే పథకాలు మంచివన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశంలో రైతు ఎదుర్కొంటున్న సమస్యలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి రైతుల్లో నెలకొన్న ఆగ్రహమే కారణమనే విశ్లేషణల నేపథ్యంలో.. అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో ‘అన్నదాత’పై దృష్టి సారించనున్నాయి. ఇందులో రైతు రుణమాఫీపై ప్రధాన ఎజెండాగా మారింది. దేశంలో ఏడు రాష్ట్రాలు ఇప్పటికే రుణమాఫీని అమలు చేస్తున్నాయి. అయితే.. రుణమాఫీ ప్రభుత్వాలకు ఆర్థికంగా గుదిబండ అవుతుందని ఆర్బీఐ, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు అవసరానికి ఆర్థిక సాయం అందించే పథకాలు మంచివన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో, ఒడిశా కాలియా పేరుతో, జార్ఖండ్‌ సర్కారు మరో పేరుతో రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొన్నటివరకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుకు కనీస మద్దతు ధర అందేలా ‘భావాంతర్‌ భుగ్తాన్‌’ యోజన అమలు చేసింది. కనీస మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు ఉన్న తేడా సొమ్మును రైతు ఖాతాలో జమ చేయడం ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ రెండేళ్ల క్రితమే రైతు భరోసా పేరుతో పథకాన్ని ప్రకటించింది. 2017, జూలై 9న జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల్లో ఈ పథకం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్నదాతే ప్రధాన అజెండాగా మారతారా అనే చర్చ జరుగుతోంది.  


ఆరోగ్య బీమా కేంద్రం X రాష్ట్రాలు
ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన వైద్య సాయం అందేలా కేంద్రం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ప్రారంభించింది.  ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తున్నందున ఆయుష్మాన్‌తో పనేముందని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్య సంరక్షణ కూడా ప్రధాన అంశంగా మారనుందనేది నిర్వివాదాంశం. దేశ ప్రజలకు అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ప్రారంభించింది. ఈ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన వైద్య సాయం అందుతుంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలు (దాదాపుగా 50–60 కోట్ల మంది ప్రజలు) ఈ పథకం పరిధిలోకి వస్తాయి. అయితే ఈ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం రాష్ట్రాల పరిధి కిందకు వస్తుందని.. ఈ పథకం ద్వారా రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని ఈ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేస్తున్నందున ఆయుష్మాన్‌తో పనేముందని వాదిస్తున్నాయి. దీనికితోడు ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రభుత్వ వాటాగా కట్టే బీమా సొమ్మును రాష్ట్రాలే చెల్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఆరోగ్య బీమా పథకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రాలుస్తుందా అన్నది చర్చనీయాంశం కానుంది. 

సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతాయా?
నియంత్రణరేఖ వెంబడి భారీ దాడికి పాకిస్తాన్‌ సరిహద్దు రక్షణ బృందం (బీఏటీ) చేసిన ప్రయత్నం రెండు దేశాల మధ్య పెరగనున్న ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది.
2018లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. కొత్త సంవత్సరంలోనూ భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. ఈసారి కశ్మీర్‌లో మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో.. చొరబాట్లు వచ్చే ఏడాది ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.  సంవత్సరం చివరి రోజున.. కశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ సైనికులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మన బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ ప్రయత్నంలో ఇద్దరు పాక్‌ జవాన్లు మరణించారు. అటు, నియంత్రణరేఖ వెంబడి భారీ దాడికి పాకిస్తాన్‌ సరిహద్దు రక్షణ బృందం (బీఏటీ) చేసిన ప్రయత్నం రెండు దేశాల మధ్య పెరగనున్న ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. దీనికితోడు పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం.. ఆర్మీ చెప్పుచేతుల్లోనే పాలన కొనసాగిస్తుండటం, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తరచూ రెచ్చగొట్టేలా ప్రకటను ఇవ్వడం ఇరుదేశాల ఉద్రిక్తతలు మరింత పెరిగేందుకు సంకేతాలిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తరహా లేదా అంతకన్నా ఎక్కువ శక్తిమంతమైన దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ దాడులు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. 


దూసుకొస్తున్న ఐఓటీ,కృత్రిమ మేధ
ఆఫీసులో కూర్చుని ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవడం.. ఏసీ ఎప్పుడు ఆన్‌/ఆఫ్‌ కావాలో ఎక్కడి నుంచైనా నిర్ణయించడం ఐఓటీ టెక్నాలజీ సౌకర్యాలు
నిన్న, మొన్నటివరకూ సామాన్యుడికి సంబంధం లేదని అనుకున్న కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల రూపంలో అరచేతుల్లోకి చేరిపోయింది. 2019లో దీని పరిధి మరింత విస్తృతం చేసుకుని. దాదాపు అన్ని రంగాల్లోనూ తన ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాలు (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), అక్రమాలకు తావివ్వని బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలు 2019లో అందరికీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. వరద ముప్పుపై ముందస్తు హెచ్చరికలు చేసేందుకు, మధుమేహం కారణంగా కంటికి జరిగే నష్టాలను తెలుసుకునేందుకు గూగుల్‌ కృత్రిమ మేధ సాయంతో ఇప్పటికే  ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగార్థుల దరఖాస్తులను వడపోసి సరైన వారిని గుర్తించేందుకూ ఈ అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి. ఆఫీసులో కూర్చుని ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవడం.. ఏసీ ఎప్పుడు ఆన్‌/ఆఫ్‌ కావాలో ఎక్కడి నుంచైనా నిర్ణయించడం.. రైతన్న ఇంట్లో కూర్చుని పంటకు నీరు, ఎరువులు ఎప్పుడు, ఎంతమేరకు వేయాలో తేల్చేయగలగడం.. ఐఓటీ టెక్నాలజీ ద్వారా వచ్చే సౌకర్యాలకు కొన్ని ఉదాహరణలు. 

నట్టింట్లో బూతు పురాణం
మన ప్రమేయం ఇసుమంతైనా లేకుండా నేరుగా..  ఇళ్లల్లోకి, మన పిల్లల మస్తిష్కాల్లోకి చొరబడి నవతరాన్ని ప్రభావితం చేస్తోన్న అశ్లీల, అసభ్య, అనైతిక ఇంటర్నెట్‌ దృశ్యాల నుంచే ఈ యేడాది మనకు ప్రమాదం పొంచి ఉంది. 
ఒకప్పుడు సినిమా పాటలో అశ్లీలం ఉందంటేనే తీవ్ర విమర్శలు వచ్చేవి. ఆ తర్వాత నిబంధనలు కాస్త సరళీకృతమైనా.. సినిమాల్లో అశ్లీలాన్ని నియంత్రించేందుకు సెన్సార్‌బోర్డు తనవంతు పనిచేస్తోంది. కానీ.. పెరుగుతున్న సాంకేతికత ఎలాంటి పట్టపగ్గాల్లేకుండా బూతును నేరుగా నట్టింట్లోకి తీసుకొచ్చింది. మన ప్రమేయం ఇసుమంతైనా లేకుండా నేరుగా.. మన ఇళ్లల్లోకి, మన పిల్లల మస్తిష్కాల్లోకి చొరబడి నవతరాన్ని ప్రభావితం చేస్తోన్న డిజిటల్‌ వ్యవస్థ నుంచే ఈ యేడాది మనకు ప్రమాదం పొంచి ఉంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ల ద్వారా.. అశ్లీల, అసభ్య, అనైతిక ఇంటర్నెట్‌ దృశ్యాలు.. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ.. మన సంస్కృతిపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ల్లో నగ్న, అర్థనగ్న చిత్రాలతో పాటు బూతుపురాణం కూడా వెగటుగా తయారైంది. దీనికితోడు చిన్నారులను ఆత్మహత్యకు పురిగొల్పే ‘బ్లూవేల్‌’ వంటి మొబైల్‌ గేమ్స్‌ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇలాంటి వెబ్‌సిరీస్‌లు, గేమ్స్‌ను నియంత్రించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 


క్రికెట్‌ ప్రపంచకప్‌ మనదేనా
మే 30న ప్రారంభమయ్యే క్రికెట్‌ పండగ ఈ ఏటి ఆసక్తికర క్రీడాంశాల్లో మొదటి స్థానంలో నిలువనుంది. భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
 
క్రికెట్‌ అభిమానులంతా ఎదురు చూస్తున్న పెద్ద పండగ 2019– వన్డే వరల్డ్‌ కప్‌.. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనుంది. ఇప్పటికే 1983, 2011 ప్రపంచకప్‌లను గెలుచుకున్న భారత్‌ ఈసారి కూడా టైటిల్‌ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో జట్టు విదేశాల్లో చూపిస్తున్న ఆటతీరు. కోహ్లీ ఆటతీరు, జోష్‌తోపాటు.. జట్టులో ఉత్సాహమైన యువరక్తం అవకాశం వచ్చినపుడు సత్తా చాటుతుండటంతో భారత జట్టు విజయావకాశాలపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఏడాది కాలంగా విదేశాల్లో భారత బౌలర్లు (ముఖ్యంగా పేస్‌ బౌలర్లు) రాణిస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో స్థిరంగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్‌ (రోహిత్‌ శర్మ, రాయుడు, కోహ్లీ, శిఖర్‌ ధావన్, హార్దిక్‌ పాండ్యా తదితరులు)లు భారత జట్టులో ఉండటమే ఈ భారీ అంచనాలకు కారణం. దీనికితోడు భారత క్రికెట్‌ను ఉన్నతశిఖరాలకు చేర్చడంలో తన పాత్రకు న్యాయం చేసిన మహేంద్రసింగ్‌ ధోనీ తన చివరి వరల్డ్‌ కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మే 30న ప్రారంభమయ్యే క్రికెట్‌ పండగ ఈ ఏటి ఆసక్తికర క్రీడాంశాల్లో మొదటి స్థానంలో నిలువనుంది. భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

మ్యాన్‌ – మెషీన్‌ అనుసంధాన విద్య
ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అటోమేషన్, రొబోటిక్స్, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులకు ప్రాధాన్యం పెరగనుంది.

తయారీ, సేవలు తదితర రంగాలతోపాటు ఆటోమొబైల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, ఈ–కామర్స్‌ విభాగాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పాత్ర పెరుగుతున్న తరుణంలో.. సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు లేని లక్షల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో రొబోటిక్స్, అటోమేషన్‌ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. మారుతున్న వ్యాపారాలు, పనివాతావరణం, ఉత్పత్తి ప్రక్రియల కారణంగా ఎంత రొబోటిక్స్‌ ప్రభావం ఉన్నా.. మ్యాన్‌–మెíషీన్‌ సమన్వయం తప్పనిసరంటూ పరిశోధకులంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అటోమేషన్, రొబోటిక్స్, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సులకు ప్రాధాన్యం పెరగనుంది.

ఏమంటాయో!
చమురు ధరల పతనం, ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ ఉదారవాద విధానాన్ని అవలంభించడంతో రూపాయి పుంజుకోవచ్చు.
ముడిచమురు బ్యారెల్‌ ధర 82 డాలర్లను చూసి.. మళ్లీ ఇపుడు 50 డాలర్ల శ్రేణిలోకి వచ్చింది. అలాగే మన రూపాయి డాలర్‌తో పోలిస్తే ఏకంగా 74 రూపాయలను దాటేసి.. ఇపుడు రూ.70 కిందికు దిగింది. ఇవే 2019లో మన స్టాక్‌ మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థనూ శాసించబోతున్నాయి. పతనమైన ముడి చమురు ధరలపై ఒపెక్‌ దేశాల నిర్ణయం నేపథ్యంలో మరింతగా పతనమవుతుందని ఊహించలేం.  ద్రవ్యోల్బణం దిగివస్తుండటం, చమురు ధరల పతనంతో డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవచ్చు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement