వూహాన్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నినాదాలిస్తున్న నర్సులు
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాటికి కరోనా వైరస్‌తో 2,293 మంది మృతి చెందగా, మొత్తం కేసులు 70,756కు చేరుకున్నాయి. ఈ మహమ్మారితో 24 గంటల్లో 87 మంది చనిపోగా కొత్తగా 3,604 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22,454 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా రికవరీ రేటు 31.74 శాతంగా ఉందని పేర్కొంది. కోవిడ్ బాధిత మృతుల్లో 70 శాతం వరకు ఇతర అనారోగ్య సమస్యల వల్లే సంభవించాయని తెలిపింది.
కేసులు రెట్టింపయ్యేందుకు 12.2 రోజులు
దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం 10.9 రోజుల నుంచి 12.2కు చేరుకుందని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలోని 347 ప్రభుత్వ, 137 ప్రైవేట్ ల్యాబొరేటరీలకు రోజులో ఒక లక్ష కోవిడ్–19 పరీక్షలు జరిపే సామర్థ్యముందన్నారు. ఇప్పటి వరకు 17,62,840 పరీక్షలు జరగ్గా, మంగళవారం ఒక్కరోజే 86,191 నమూనాలను పరీక్షించారని ఆయన వెల్లడించారు.
నర్సులు లేకుండా కోవిడ్‌పై గెలవలేం
నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు సేవలందించకుంటే కోవిడ్ మహమ్మారిపై గెలుపు సాధించలేమని మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను మంత్రి కొనియాడారు. ‘ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు లేకుండా కోవిడ్‌పై గెలుపు సాధించలేం. ఆరోగ్య కార్యకర్తలు, నర్సులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాం’అని పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ సర్వే
దేశంలో కరోనా తీవ్రత ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సర్వే చేపట్టనుంది. జనాభా ఆధారిత సెరో సర్వేను దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లో చేపట్టనుంది. కోవిడ్–19 కేసుల ఆధారంగా నాలుగు రకాలుగా జిల్లాలను విభజించి 24 వేల మంది నుంచి వివరాలు సేకరించనుంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఓ అధికారి తెలిపారు. సెరో సర్వే అంటే ఒక సమూహంలోని వ్యక్తుల రక్తంలోని సీరంను పరీక్షించడం.
ఈ వేసవిలో అసాధారణ పరిస్థితులు
మే నెల అంటే భగ్గుమనిపించే ఎండలు..ఆపై ప్రాణాలు తీసే వడగాలులు..కానీ, ఈ ఏడాది మే నెల సగం పూర్తి కావొస్తున్నా వడగాలులు లేవు సరికదా అత్యధిక వర్షపాతం నమోదైంది. అందుకే ఇది అసాధారణ వేసవి అంటున్నారు వాతావరణ నిపుణులు. ఉత్తర, పశ్చిమ మైదాన ప్రాంతం, విదర్భ–మరాఠ్వాడా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి తీవ్రమైన ఎండలు కాస్తాయి. పశ్చిమ రాజస్తాన్‌లోనైతే అత్యధికంగా 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
కానీ, ఈసారి తీవ్రంగా ఎండలు కాసే చోట సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలకు నమోదయ్యే అవకాశాలున్నప్పటికీ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఏప్రిల్‌లో రెండు విడతలుగా వడగాలులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది గుజరాత్‌లో మాత్రమే, అదీ కొద్దిపాటి వడగాలి వీచిందని పుణెలోని వాతావరణ విభాగం నిపుణులు తెలిపారు. మే నెలలో పశ్చిమం నుంచి రెండు సార్లు గాలులు వీయగా, త్వరలోనే మరో దఫా వచ్చే అవకాశాలున్నాయన్నారు. అయితే, ఈ నెల 16వ తేదీ తర్వాత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment