ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్
సాక్షి, న్యూఢిల్లీ: నగరానికి అనుసంధానమయ్యే ట్రాన్స్‌మిషన్ లింకులను ఈ నెల 22వ తేదీకల్లా పునరుద్ధరిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
కేంద్ర మంత్రితో భేటీ
విద్యుత్ సంక్షోభం నగరానికి శాపంగా పరిణమిం చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై చర్చిం చారు. గత నెల 30వ తేదీనాటి గాలిదుమారం త తర్వాత తలెత్తిన విద్యుత్ సంక్షోభం బీజేపీ తలనొప్పిగా పరిణమించింది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన ఉండడంతో ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రెండు వారాల సమయం పడుతుం దని పీయూష్ వారం క్రితం ప్రకటించిన సంగతి విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులు కేంద్ర మంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
కాగా విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం సీమాపురి, పట్పర్‌గంజ్ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టడంతోపాటు 24వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను కాసేపు అడ్డుకున్నారు.