
విభిన్న అనుభవాల కోసం ఒంటరిగా ఇండోనేసియా చుట్టేశాడు ఆకాశ్ మల్హోత్రా. సాహసాల చుట్టూ తిరిగే సరదాలు.. అతడిని కొమాడో డ్రాగన్ల ముందుకు తీసుకెళ్లాయి. మంటా రేస్ (భారీ ఆకారంలో వుండే సముద్ర జంతువులు) మధ్య ఈత కొట్టించాయి. మౌంట్ బటుర్ అగ్నిపర్వత శిఖరారోహణం చేయించాయి. శిఖరంపై నిలబడి సుందర సూర్యోదయ దృశ్యాలను వీక్షించాడు ఆకాశ్. జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలను ఇష్టపడతాడు 26 ఏళ్ల ఆ కుర్రాడు. నాలుగేళ్లలో 34 దేశాల్ని చుట్టొచ్చాడు. సంపాదనలో అధిక భాగాన్ని ప్రయాణాలకే వెచ్చిస్తున్న ఈ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ యజమాని.. తన వెతుకులాట ఆనందం కోసమేనంటాడు. అమెరికన్ పారిశ్రామికవేత్త టిమ్ ఫెర్రిస్ రచించిన ‘ది ఫోర్ అవర్ వర్క్ వీక్’ పుస్తకం చదివి స్ఫూర్తి పొందాడు ఆకాశ్.
రుణాలు తీసుకుని మరీ..!
ఆకాశ్ మాదిరిగా మన దేశ యువతీయువకులు అధిక సమయాన్ని ప్రయాణానికి కేటాయించలేకపోవచ్చు. కానీ ప్రపంచాన్ని వీక్షించాలనే కోరిక మాత్రం వారిలో బలంగా ఉంది. వస్తువుల కంటే అనుభవాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన మిలీనియల్ ట్రావెల్ సర్వే ప్రకారం 66 శాతం మంది భారత యువతీ యువకులు (18–35 వయోశ్రేణి) ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు ప్రయాణాలు చేస్తున్నారు. మరో 10 శాతం మంది ఏడాదికి 6 నుంచి 10 సార్లు ప్రయాణాలు చేస్తున్నారు. అవసరమైతే ప్రయాణ ఖర్చుల కోసం లోన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. క్యుబెరా, ఫింజీ, ఫెయిర్‌సెంట్, రెబిక్యూ వంటి కంపెనీలు గత రెండేళ్లలో ఇచ్చిన రుణాల్లో 12 నుంచి 20 శాతం ఇలాంటివే.
- ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలిచ్చే క్యుబెరా టెక్నాలజీ కంపెనీ వెలువరించిన గణాంకాల ప్రకారం గతేడాది ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న 1,700 మందిలో 728 మంది 28 ఏళ్లలోపు వారే. తమ వద్ద రుణం కోసం చూపే మొదటి ఐదు కారణాల్లో.. ‘ట్రావెల్’ ఒకటని చెబుతున్నారు రిస్క్ అట్ క్యుబెరా అధిపతి అనుభవ్ జైన్. గత ఆర్థిక సంవత్సరం రూ.6 కోట్ల ప్రయాణ రుణాలు ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్ల రుణాలు మంజూరు చేయాలనుకుంటోంది.
- కో– ఫౌండర్ అభినందన్ సంగం అందించిన వివరాల ప్రకారం ఫింజీ కంపెనీ రుణ మంజూరు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయడం, ప్రీ పేమెంట్ చార్జీలను మినహాయించడం వంటి వెసులుబాట్ల ద్వారా యువతను బాగా ఆకర్షిస్తోంది. ఫెయిర్‌సెంట్ ప్రయాణాలు, పెళ్లిళ్లు, హనీమూన్ ట్రిప్పులకు 6 శాతం మేరకు రుణాలు ఇచ్చింది. రెండేళ్లలో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ గాంధీ చెబుతున్నారు. రుబిక్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ది కూడా ఇదే అనుభవం.
- ఎక్స్‌పెడియా మిలీనియల్ సర్వే 2017 ప్రకారం 56 శాతం యువతీయువకులు డిస్కౌంట్ల తాలూకూ సమాచారం, ప్యాకేజీల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 85 శాతం మంది చెల్లింపుల్లో సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా థామస్ కుక్ ఇండియా వంటి ట్రావెల్ కంపెనీలు తమ లావాదేవీల్లో మార్పులు చేసుకుంటున్నాయి. ఈ కంపెనీ – మిలీనియల్స్ కోసం 2016లో హాలిడే సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ ఆరంభించడం ఇందులో భాగమే. నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా హాలిడే టూర్ వెళ్లేందుకు, పనిలో పనిగా 6.65శాతం వార్షిక వడ్డీ పొందేందుకు వీలు కల్పిస్తోంది ఈ పథకం.
Comments
Please login to add a commentAdd a comment