న్యూఢిల్లీ : 'స్టింగ్ ఆపరేషన్‌పై పార్లమెంటు బుధవారం అట్టుడికిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుని ముడుపుల వ్యవహారంపై ప్రతిపక్షాలు సృష్టించిన రభసతో ఉభయ సభలు దద్దరిల్లాయి. తృణమూల్ నేతలు ముడుపులు తీసుకున్న టేపులపై విచారణ చేపట్టాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ అంశాన్ని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ముడుపులు తీసుకున్న అంశంపై విచారణ అనంతరం ఈ కమిటీ నివేదికను ఇస్తుందని స్పీకర్ తెలిపారు.
దీంతో తృణమూల్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కనీస తీర్మానం లేకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఇది అన్యాయమని సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్ రాయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే గతంలో కూడా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ కమిటీని సభలో ప్రకటించారు.
బీజేపీ సీనియర్ నేత అద్వానీ అద్వానీ నేతృత్వంలో అర్జున్ మేఘ్వాల్, కరియా ముండా (బీజేపీ), బి మహతాబ్ (బిజూ జనతా దళ్), నినాంగ్ ఎరింగ్ (కాంగ్రెస్), అక్షయ్ యాదవ్ (సమాజ్వాదీ పార్టీ) తదితర 15 మంది సభ్యులతో ఎథిక్స్ కమిటీ కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ అద్వానీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీపై నమ్మకముందని, తమకు న్యాయ జరుగుతుందన్న విశ్వాసాన్ని రాయ్ వ్యక్తం చేశారు.
కాగా పశ్చిమబెంగాల్ కు చెందిన టీఎంసీ మంత్రులు, ఎంపీలు కొందరు ఓ ప్రైవేటు కంపెనీ దగ్గర పనుల కోసం ముడుపులు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన వ్యవహారం బెంగాల్‌లో, ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.