మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది.
ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు.