సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్, బిహార్‌లలో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే హిమాచల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండేలతో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్నికలకు సంబంధించిన పలు విషయాల్లో విభేదాలున్నాయి.
ఈ నేపథ్యంలో తాను తదుపరి ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయనని వీరభద్ర సింగ్ చెప్పారు. తమ నాయకుడి బాటలోనే తామూ నడుస్తామని కొంతమంది హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో భేటీ అయిన అనంతరం...ఎన్నికల్లో పోటీ చేయనని వీరభద్ర సింగ్ ప్రకటించారు. అటు బిహార్‌లోనూ ఇటీవల సీఎం నితీశ్ కుమార్ మహా కూటమి నుంచి బయటకు రావడంతో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం తెలిసిందే. దీంతో కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. బిహార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సదానంద్ సింగ్‌ను ఢిల్లీ రావాల్సిందిగా సోనియా ఆదేశించారు.