సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు.
తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్‌కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్‌కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు.
‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment