ఐదుగురు పోలీసులు దుర్మరణం
పట్నా : బిహార్‌లో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైకి ఓ భారీ వాహనం దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఓ డీఎస్పీ, ఓ ఇంచార్జీ పోలీసు అధికారి, కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి కారణమైన భారీ వాహనం డ్రైవర్ పరారయ్యాడు. ఇంకా అతడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి బిహార్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం డీఎస్పీ మురారీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అఖురహా అనే గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మోతిహారి వైపు నుంచి వేగంగా వచ్చిన వాహనం నేరుగా పోలీసులపైకి దూసుకొచ్చింది. తొలుత ఓ పోలీసు కారును ఢీకొట్టగా అది గాల్లో లేచి 40 అడుగుల దూరంలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వెంటనే నేరుగా పోలీసులపైకి వెళ్లిన వాహనం వారిని చిద్రం చేసిందని తెలిపారు. కొంతమంది గాయపడ్డారని, వారిని వెంటనే ముజఫర్ నగర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేజిస్ట్రేట్ యాక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా?, తాగిన మైకంలో ఉండటం వల్ల జరిగిందా? లేక నిద్రపోవడమే ప్రమాదానికి కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది.