వాషింగ్టన్: కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికై మధ్యవర్తిత్వం వహించడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని శ్వేతసౌధ అధికారి ఒకరు వెల్లడించారు. కశ్మీర్ పరిస్థితిని అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి భారత్, పాక్ సహాయం కోరితే సమస్యను పరిష్కారించడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న పరిణామాలపై ట్రంప్ దృష్టి సారించారని, అయితే భారత్ ఎటువంటి అధికారిక మధ్యవర్తిత్వాన్ని అభ్యర్థించలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు అధికారి తెలిపారు.
కాగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను ఆగస్టు 5న రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం విదితమే. అయితే ఐక్యరాజ్యసమితి సహా ఇతర ప్రధాన దేశాల నుంచి కూడా పాక్ ఆశించిన సహాయం అందలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 24-26 మధ్య ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 సమ్మిట్‌లో ట్రంప్ కశ్మీర్ అంశంపై ప్రస్తావించనున్నారని బహిర్గతమవుతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడం పూర్తిగా అంతర్గత వ్యవహారమని, వాస్తవికతను అంగీకరించాలని పాకిస్థాన్‌కు సూచించామని ఈ మేరకు భారత్ ప్రపంచ దేశాలకు స్స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్న తరుణంలో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి ఆయన తీసుకున్న చర్యలను గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment