వాషింగ్టన్ : కశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో భారత్- పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశాలైన భారత్- పాక్ సంయమనం పాటిస్తూ.. పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ట్రంప్ ఇరు దేశాలకు సూచించారు. కాగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ..‘ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు భారత్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది శాంతిస్థాపనకు ఎంతమాత్రం సహాయకారి కాదు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముంది. అందులోభాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించాలి. దీంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు.
అదే విధంగా ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, స్వతంత్ర, సురక్షితమైన అఫ్గానిస్తాన్ కోసం తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా ఇమ్రాన్ అభివర్ణించడం తెల్సిందే. భారత అణ్వాయుధాలపై దృష్టి సారించాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ట్రంప్ ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులకు అడ్డుకట్టపడేలా...భారత్‌తో చర్చించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లతో సంభాషణ చక్కగా సాగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు...‘ నా ఇద్దరు మంచి స్నేహితులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు.. అన్నింటికీ మించి ప్రస్తుతం కశ్మీర్‌లో ఉద్రికత్తలను తొలగించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాను. ఎంతో కఠినమైన పరిస్థితులు.. అయితే చక్కటి సంభాషణ కొనసాగింది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
Spoke to my two good friends, Prime Minister Modi of India, and Prime Minister Khan of Pakistan, regarding Trade, Strategic Partnerships and, most importantly, for India and Pakistan to work towards reducing tensions in Kashmir. A tough situation, but good conversations!
— Donald J. Trump (@realDonaldTrump) August 19, 2019
Comments
Please login to add a commentAdd a comment