సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో 25 మంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పసుపు రైతులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అధ్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 54 మందిలో 25 మంది మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. మిగతా రైతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులు కలెక్టరేట్ ఎదుట రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు. తమకు మద్దతు ఇచ్చిన స్థానికులను బీజేపీ నాయకులు బెదిరించారని రైతులు వాపోయారు.
వారణాసి వెళ్లిన రైతుల్లో 10 మంది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోద్బలంతోనే వీరంతా వారణానికి వెళ్లారని అన్నారు. రైతుల సమస్యలను ఆమె ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. తాము ఎవరినీ వ్యతిరేకించడానికి వారణాసి రాలేదని, తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకురావడానికే మోదీపై నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్టు రైతులు వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ. 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment