
ఆర్మూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి జిల్లా నుంచి వెళ్లిన పసుపు రైతులు అక్కడ అడుగడుగునా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో నామినేషన్లు వేయడానికి 54 మంది రైతులు వెళ్లినప్పటికీ 35 మంది రైతులు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. వీరిలో కేవలం 25 మంది మాత్రమే తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు సమర్పించడంలో విఫలమైన రైతులు ఎన్నికల కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేవిధంగా ఎన్నికల అధికారులు, పోలీసులు వ్యవహరించారని వారు ఆరోపించారు.
అడుగడుగునా ఆటంకాలు
వారణాసికి చేరుకున్న పసుపు రైతులు అక్కడి ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. రైతులు బస చేసిన హోటల్ రూమ్‌లలో పోలీసులు ప్రతి రోజు సోదాలు చేయడంతో పాటు తమ నామినేషన్లకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 35 మంది రైతులు నామినేషన్ పత్రాలను పూర్తి చేసుకొని చలాన్ కోసం నిలబడగా సుమారు రెండు గంటల సేపు చలాన్ ఫామ్‌లను ఇవ్వని కారణంగా పది మందికి పైగా రైతులు నామినేషన్ వేయలేకపోయారు. అయితే నామినేషన్ల స్వీకరణకు ఉదయం 10 గంటలకే కార్యాలయం తెరవాల్సిన అధికారులు ఆలస్యంగా 11 గంటలకు కార్యాలయాన్ని తెరిచారని రైతు నాయకులు ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన రైతుల మద్దతుదారులను పోలీసులు లోపలికి అనుమతించకపోవడం, లోపలికి వెళ్లిన రైతులను మద్దతుదారులు ఎక్కడ అని ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎట్టకేలకు 25 మంది రైతు నాయకులు మాత్రమే నామినేషన్లు సమర్పించగలిగారన్నారు. నామినేషన్లు సమర్పించిన వారిలో పెంట చిన్న ముత్తన్న (కమ్మర్‌పల్లి), కుంట గంగామోహన్ రెడ్డి (ఆర్మూర్), గురడి రాజరెడ్డి (డిచ్‌పల్లి), కల్లెం లక్ష్మణ్ (కమ్మర్‌పల్లి), కొట్టాల చిన్నరెడ్డి (పడిగెల) తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment