సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు.
ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు.
కాగా తూత్తుకుడి స్టెర్‌లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment