
అమెరికాతో ఒప్పందాలకు తుదిరూపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా.. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే దిశగా అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. ఉగ్రవాద సంబంధిత సమాచార మార్పిడి, నకిలీ కరెన్సీ నోట్ల సరఫరాను అడ్డుకోవడంలో సహకారం, వ్యాపారవేత్తలకు సులభ వీసా.. మొదలగు ఒప్పందాలపై ఒబామా భారత్‌లో ఉండగానే సంతకాలు జరిగేలా చూడాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. పాక్‌లో తయారై చలామణి అవుతున్న భారత నకిలీ కరెన్సీ సమస్యను అధిగమించేందుకు భారత్ అమెరికా సాయం కోరుకుంటోంది.
భారత్, అమెరికా అణు ఒప్పందం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాల అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య పరిపాలనాపరమైన, అణు పరిహారానికి సంబంధించిన అంశాలు ఈ ఒప్పందం అమలులో పీటముడులయ్యాయి. ఏడేళ్ల నాటి అణు ఒప్పందం అమలు కోసం రెండు దేశాల అధికారులతో ఏర్పాటైన ఉన్నతస్థాయి బృందం బుధవారం సమావేశం కానుంది. అందులో రక్షణ సంబంధ అంశాలకు తుది రూపం ఇచ్చేందుకు పెంటగాన్ ఉన్నతాధికారి ఫ్రాంక్ కెండల్ కూడా బుధవారం ఢిల్లీ వస్తున్నారు. ఒబామా భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాటు, భారత ప్రధాని మోదీతో చర్చల్లో పాల్గొంటారు.
ఆగ్రా నుంచి అమెరికాకే.. జనవరి 27న తాజ్‌మహల్ దర్శనానంతరం ఒబామా.. ఆగ్రా నుంచి నేరుగా అమెరికా వెళ్లే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక వద్దకు ఒబామా తన అధికారిక వాహనం బీస్ట్’లోనే వస్తారు. ఆ వాహనం కూడా రాష్ట్రపతి కాన్వాయ్‌లోనే భాగంగా ఉంటుంది. లాడెన్‌ను అంతమొందించిన నేవీ సీల్స్‌లో భాగమైన 8 బెల్జియన్ మాలినోయిస్ శునకాలు అమెరికా అధ్యక్షుడి భద్రతలో భాగంగా భారత్‌కు చేరుకున్నాయి.
‘ఒబామా పర్యటననను బహిష్కరించండి’
రాయ్‌పూర్: ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్‌లో కరపత్రాలు ముద్రించారు. ఒబామా పర్యటనను బహిష్కరించాలని, ఈ పర్యటనకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ చేపట్టాలని మావోలు పిలుపునిచ్చారు.
ఒబామా పర్యటన ఇదీ..
జనవరి 25 వేకువజామున 4.45కు ఢిల్లీకి రాక
ఉదయం 10.10 గంటలు: రాష్ట్రపతి భవన్‌కు
10.40: రాజ్‌ఘాట్‌కు రాక, 11.20: హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ, 1.50: ఇరువురు నేతల మీడియా సమావేశం, సాయంత్రం: రాష్ట్రపతి భవన్‌లో విందు జనవరి 26: ఉదయం 9.25: రాష్ట్రపతి భవన్‌కు రాక, 10.00: గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, 12.40-3.10: సీఈవో సదస్సులో ప్రసంగం, సాయంత్రం 5.45: ప్రధాని మోదీతో కలసి మౌర్యా షెరటాన్‌లో సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశం, 6.50-7.20: రౌండ్‌టేబుల్ భేటీలో ప్రసంగం, రాత్రి: ప్రధానితో విందు
జనవరి 27: ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక, 12.20-1.30: హోటల్‌లో మధ్యాహ్న భోజనం, 3.05-4.05: తాజ్‌మహల్ సందర్శన, సాయంత్రం 4.35: పాలం ఎయిర్‌పోర్టుకు, 5.50 గంటలు: అమెరికాకు తిరుగు పయనం