ట్రాఫిక్ జాంతో మెట్రో నగరాల్లో రోడ్డుపై నిలిచిన వాహనాలు(పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ఏటా 2,200 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో తోటి ఆసియా నగరాల కన్నా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరవాసులు గంటన్నర సేపు ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్ రద్దీలో గడుపుతున్నట్లు ఉబర్ టాక్సీ సర్వీసు సంస్థ ఏర్పాటు చేసిన బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెల్లడించింది. నగర వాసులు ఒక చోటు నుంచి గమ్యస్థానానికి వెళ్లాలంటే పట్టే సరాసరి సగటు సమయం కన్నా ఆసియా నగరాల్లో 67 శాతం పడుతుంటే భారత్ మెట్రోపాలిటిన్ నగరాల్లో 149 శాతం ఎక్కువ పడుతుంది.
ట్రాఫిక్ రద్దీ కారణంగా కూడా దేశానికి ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్ట వాటిల్లుతోందని ఆ సంస్థ తెలియజేసింది. ట్రాఫిక్‌లో అదనపు సమయానికి అయ్యే ఇంధనం ఖర్చు, ఆ సమయానికి మ్యాన్ పవర్‌కు అయ్యే ఖర్చు, కాలుష్యం, ప్రమాదాలకు ఖర్చు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి అయ్యే ఖర్చును అంచనావేసి ఈ లెక్క తేల్చినట్లు సంస్థ వెల్లడించింది. 1980 సంవత్సరంతో పోలిస్తే భారత దేశంలో ట్రాఫిక్ అవసరాలు ఎనిమిదింతలు పెరిగాయి. దేశం ఆర్థికంగా ఎంతో పురోభివద్ధి చెందడం, ప్రజల్లో ఎక్కవ మంది సొంత కారులు కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
దేశంలో జనాభా పెరగడం, జన సాంద్రత ఎక్కువగా ఉండడం, మెట్రో రైళ్ల లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఆశించిన మేరకు విస్తరించకపోవడమే కారణమని ఆ సంస్థ పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఇతర నగరాలకన్నా ముంబై , ఢిల్లీ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి కాస్త మెరగుపడినప్పటికీ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment