హోంమంత్రి ఫిట్‌నెస్ ఎంత?: ఉద్ధవ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: పోలీసు ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ చెలగాటమాడుతున్నారని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉద్యోగం సంపాధించుకోవాలని గంపెడాశతో వచ్చిన యువకులు ఇలా కోరిక నెరవేరకుండానే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని, దీంతో వారి కుటుంబాలకు శోకమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నలుగురు అభ్యర్థులు చనిపోవడంతో నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించి హోంశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల భర్తీ పేరిట ఇంకా ఎంతమంది అభ్యర్థులను బలి తీసుకుంటారని హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌ను ప్రశ్నించారు. ‘ఫిట్‌నెస్ పేరుతో ఐదు కిలోమీటర్లు పరుగెత్తించడం అంత అవరసమా..? మరి పాటిల్ ఎంతమేర ఫిట్‌నెస్‌తో ఉన్నారు? ఆయన మంత్రివర్గంలో సగానికిపైగా మంత్రులకు పొట్ట ముందుకు వచ్చింది. కొవ్వు వేలాడుతోంద’ని ఎద్దేవా చేశారు. పోలీసు చరిత్రలో ఐదు కిలోమీటర్లు వెంబడించి నిందితులను పట్టుకున్న సందర్భాలున్నాయా...? అని ఆయన నిలదీశారు. ఇకనైనా ఫిట్‌నెస్ పేరుతో అమాయక నిరుద్యోగుల జీవితాలతో పరిహాసమాడడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ‘పోలీసు ఉద్యోగానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు వచ్చారు. వారి కోసం ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు.. దీన్నిబట్టి ప్రభుత్వం నిరుద్యోగులపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోందని ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నియమావళిని మార్చాలని డిమాండ్ చేశారు.
పాటిల్ కిలోమీటరైనా పరిగెడతారా: రాజ్‌ఠాక్రే
పోలీసు కొలువు కోసం వచ్చిన అభ్యర్థులను హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఐదు కిలోమీటర్లు పరిగెతిస్తున్నారు. మరి ఆయన(హోంమంత్రి) కనీసం కిలోమీటరైన పరిగెడతారా? అని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయని, ఇప్పుడూ చోటుచేసుకుంటున్నాయని, నియమనిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.