ఉమర్, అనిర్బన్ విడుదల
జేఎన్‌యూ విద్యార్థులకు 6 నెలల బెయిల్
♦ ఢిల్లీ విడిచి వెళ్లరాదని షరతు
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఫిబ్రవరి 9న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని 12 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.
తమ అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్లరాదని, కేసు దర్యాప్తు అధికారి పిలిచినప్పుడల్లా హాజరుకావాలని షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఉమర్, అనిర్బన్‌లకు జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యాపకులు సంగీతాదాస్ గుప్తా, రజత్ దత్తాలు ష్యూరిటీలు సమర్పించారు. ‘నిందితులపై మోపిన అభియోగాలు తీవ్రమైనవే. వారు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ పరిశీలనలో ఉంది. నిందితులు పారిపోయే అవకాశం ఉందనేందుకు పోలీసులు ఎటువంటి కారణాలు చూపలేదు.
ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి విభాగం నేత కన్హయ్య కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిందితులకు 6 నెలలు బెయిల్ మంజూరు చేయడం సరైనదేనని భావిస్తున్నా’ అని జడ్జి రీతేష్‌సింగ్ పేర్కొన్నారు. అంతకుముందు .. నిందితులకు బెయిల్ మంజూరును పోలీసులు వ్యతిరేకించారు. పోలీసుల వాదనలతో కోర్టు విభేదించింది. అయితే ఒకవేళ ఈ కేసులో వారు దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు సహా 3 రకాల శిక్షలు విధించే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఇద్దరు విద్యార్థులకు బెయిలు రావడంతో జేఎన్‌యూ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.‘ఆజాదీ’(స్వాతంత్య్రం) కావాలంటూ నినాదాలు చేశారు. కాగా దేశం గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి బెయిలుపై వచ్చినందుకు ఎలా వేడుకలు చేసుకుంటారని, అతడు ఒలింపిక్ పతకం ఏమైనా తీసుకొచ్చాడా అని కన్హయ్యను ఉద్దేశించి నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన చిత్రం ‘బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్’ ముందస్తుగా శుక్రవారం వర్సిటీలో ప్రదర్శించగా లెఫ్ట్ విద్యార్థులు నిరసన తెలిపారు.
నామమాత్రపు జవాబు.. ఫిబ్రవరి 9నాటి ఘటనపై షోకాజ్ నోటీసులు అందుకున్న విద్యార్థులు వరిసటీ క్రమశిక్షణ కమిటీకి నామమాత్రపు జవాబులు పంపించారు. నేరమేమిటో తెలియకుండా సంజాయిషీ ఏమని ఇస్తామని వారు పేర్నొన్నారు.