సాక్షి, న్యూఢిల్లీ : తనపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం వెనుక బీజేపీ ప్రతినిధులు, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైమ్‌టైమ్ యాంకర్ల ప్రమేయం ఉందని జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ఆరోపించారు. నిర్ధిష్టంగా ఖలీద్ ఏ ఒక్కరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. తనపై దాడివెనుక అసలైన కుట్రదారులు పాలక పార్టీ ప్రతినిధులు, ప్రైమ్ టైమ్ యాకంర్లు, కొన్ని టీవీ చానెళ్లని చెప్పుకొచ్చారు. అవాస్తవాల ప్రాతిపదికన తనను దేశ వ్యతిరేకిగా ముద్ర వేశారని, తనపై మూకదాడులను ప్రేరేపించడంతో తన జీవితం దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమర్ ఖలీద్‌పై దేశ రాజధానిలో అత్యంత భద్రతతో కూడిన కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద స్వాతంత్ర్య వేడుకలకు రెండు రోజుల ముందు ఓ వ్యక్తి కాల్పులతో తెగబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌కు సమీపంలోని వేదిక వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఖలీద్ అక్కడికి వచ్చారు. తనపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన క్రమంలో తన ప్రాణాలకు ముప్పుందని భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు దాడిచేసిన వ్యక్తి ఘటనా ప్రాంతంలో గన్‌ను వదిలివేసి పారిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 2016లో ఉమర్ ఖలీద్‌తో పాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యలను దేశద్రోహం కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment