‘హలో.. నా బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేయరా.. ’
కోల్‌కతా: సాధారణంగా పోలీసులు వేధిస్తున్నారని అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ, పోలీసులే తీవ్ర వేధింపులకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌లో కనిపిస్తోంది. ఎందుకంటే అత్యవసర సేవలు అందించే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 100కు అర్ధం పర్ధం లేని ఫోన్ కాల్స్ దండిగా వస్తున్నాయంట. రోజుకు కనీసం 1000 వరకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని వాటికి సమాధానం చెప్పలేకపోతున్నామని బిధన్నగర్ సిటీ పోలీస్ కంట్రోల్ రూం పోలీసులు చెబుతున్నారు.
బాగా తాగిన వాళ్లు, చిన్నపిల్లలు, చిల్లరగాళ్లు, బాయ్‌ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న గొడవలు పడి ఒత్తిడితో ఫోన్ చేసేవాళ్లు, ఇంట్లో తినకుండా చదవకుండా, భోజనం చేయకుండా మారాం చేస్తున్నాడని ఫిర్యాదులు చేసేవాళ్లు ఎక్కువయ్యారని అంటున్నారు. ఇలాంటి ఫోన్‌ల కారణంగా నిజంగా ఇబ్బందుల్లో పడి ఫోన్ చేసేవాళ్లు నష్టపోతున్నారని, ముఖ్యంగా సెలవు రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఏ ఫోన్‌కాల్ అయినా ఫేకా కాదా అనే విషయం మాట్లాడేవరకు తెలియదని, ముందుగా ఫిల్టర్ చేయడం సాధ్యం కాదని ఈ కారణంగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వస్తేనే చిరాకు లేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
‘తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన ఓ అమ్మాయి ఫోన్ చేసి మా బాయ్ ఫ్రెండ్‌ను అరెస్టు చేయండి అంటుంది. అలాగే, మా అబ్బాయి మారాం చేస్తూ అసలు తినడం మానేశాడని కాస్త బెదరించండి అంటూ మరో ఇంటావిడ ఫోన్ చేస్తుంది. అలాగే, బాగా తాగి ఉన్న వాళ్లు, చిన్నారులు ఇలా ఎవరు పడితే వాళ్లు అత్యవసర నెంబర్‌కు ఫోన్ చేసి విసిగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా ఎక్కువయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటితో చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని కంట్రోల్ రూమ్ అధికారులు తమ సమస్యను చెప్పుకుంటున్నారు.