జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా! | Union budget 2015: so many expectations on Arun Jaitley | Sakshi
Sakshi News home page

జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా!

Published Fri, Feb 27 2015 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా!

జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా!

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. అలాగే పన్ను మినహాయింపుల ద్వారా  పొదుపు చర్యలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు.  ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం లేకుండా గృహరుణాలకు మరింత రాయితీలు కల్పించాలని, 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని మధ్యతరగతి వారు ఆశిస్తున్నారు. ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసారాల శాఖలను కూడా జైట్లీ నిర్వహిస్తున్నందున బడ్జెట్‌లో తమకూ న్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి.

2014లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అరుణ్ జైట్లీ రూ. 2 లక్షలుగా ఉన్న ఆదాయం పన్ను రాయితీని రూ. 2.5 లక్షలకు పెంచడంతోపాటు పన్ను శ్లాబుల్లో రాయితీలను పెంచారు. పలు సందర్భాల్లో ఆదాయం పన్ను రాయితీలను పెంచుతామని అరుణ్ జైట్లీయే స్వయంగా ప్రకటించినందున ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల ఆదాయం పన్ను కనీస పరిమితిని కనీసం రూ. 3 లక్షలకు పెంచడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే శ్లాబుల్లోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న ఆదాయ వనరులను పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచవచ్చని, క్రూడాయిల్ (ముడి చమురు) దిగుమతులపై ఎత్తేసిన కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు చేరుకున్న నేపథ్యంలో 2011, జూన్‌లో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకున్నందున తిరిగి సుంకం విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రూడాయిల్‌పై ఐదు శాతం సుంకం విధించినా కూడా రూ. 18 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. దేశీయంగా ఉత్పత్తవుతున్న క్రూడాయిల్‌పై రెండు శాతం పన్ను ఇప్పటికీ అమల్లో ఉంది. క్రూడాయిల్ వినియోగంలో మనం 80 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. సుంకం విధింపు వల్ల అనివార్యంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి.

అధిక ఆదాయం పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా గత ఆరునెలలుగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ కారణంగా 20 నుంచి 30 శాతం వరకు భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.

సరుకులు, సేవా పన్నులను పెంచడం ద్వారా ప్రత్యక్ష పన్నులను స్థిరీకరించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సేవా పన్నును 12 నుంచి 14 శాతానికి పెంచవచ్చని వారి అంచనా. అదే జరిగితే ఫోన్ కాల్స్ చార్జీలు, హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. జిమ్‌లు ప్రియమవుతాయి. క్లబ్ మెంబర్‌షిప్పులు భారమవుతాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇప్పటికే తగ్గినందున పది శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ రంగం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కోరుకుంటున్నా.. ఆ దిశగా చర్యలు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement