'అనుమతి లేకుండా వెళ్లినందునే ఉగ్రదాడికి గురి'
న్యూఢిల్లీ: అనుమతి తీసుకోకుండా డ్రైవర్ బస్సును తీసుకెళ్లడం మూలంగానే అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడికి గురి కావాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భద్రతా అధికారుల హెచ్చరికలను అతడు పరిగణనలోకి తీసుకుంటే ప్రమాదం తప్పిం ఉండేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో అమర్‌నాథ్‌యాత్రకు వెళ్లొస్తున్న భక్తులపై ఉగ్రవాదుల దాడి, చైనాతో సరిహద్దు వివాదం గురించి శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది.
ఈ భేటీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇతర పార్టీల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానాలు చెప్పారు. పలు సూచనలు చేసిన పార్టీలు చైనాతో సరిహద్దు వివాదాన్ని దౌత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ, సమగ్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.