రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా శుక్రవారం రాత్రి బరాబంకీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంత్రి మనోజ్ సిన్హా గాయాలతో పడగా ఆయన ఎడమ చేతి ఫ్రాక్చర్ అయింది. గాయపడ్డ వెంటనే లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే నిలయం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గోరఖ్‌పూర్ లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించినట్లు సమాచారం. ఈశాన్య రైల్వే లో సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ఎడమ భుజం, మోచేతి మధ్య భాగంలో ఫ్రాక్చర్ అయిందని, శనివారం సర్జరీ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.
కుశినగర్‌లో ఈవెంట్లో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే గోరఖ్‌పూర్ రైల్వే వీవీఐపీ గెస్ట్ హౌస్‌కు వచ్చి రాత్రి ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో మంత్రి వస్తున్న ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయగా, వెనక నుంచి వస్తున్న మరో వాహనం ఢీకొనగా ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, రామ్ విలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనోజ్ సిన్హా ప్రమాదానికి గురయ్యారని తెలియగానే షాక్ తిన్నామని పేర్కొన్న మంత్రులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్‌లో ఆకాంక్షించారు.