సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఆర్థిక కార్యకలాపాలు జరగాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ లాక్‌డౌన్ విస్తరణ అనేది సాధ్యం కాని పని, మళ్లీ పొడిగించడం ఉండబోదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టంచేశారు. బుధవారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు, అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని తెలిపారు. కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం మరిచిపోవద్దని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుండడంతో కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అదే విధంగా ఆదివారాల్లో లాక్‌డౌన్ ఉంటుందని పేర్కొన్నారు. అన్‌లాక్ 2.0 నిబంధనలు జూలై 22 ఉదయం 5 గంటల నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. (తగ్గిన మరణాల రేటు)
80 శాతం రోగులకు లక్షణాల్లేవు
ప్రతి కోవిడ్ రోగితో సంప్రదింపులు జరిపిన కనీసం 45 మందికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకముందు కేవలం 24 గంటల్లో కరోనా పరీక్షల ఫలితాలు వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం మంది రోగులకు ఎలాంటి లక్షణాలే కనిపించడం లేదని, ఇలాంటి సందర్భంలో కోవిడ్ కేర్ సెంటర్‌లో మాత్రమే కాకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. బెంగళూరులో 11,230 పడకలను కరోనా చికిత్స కోసం సిద్ధం చేసినట్లు, అంబులెన్సుల కొరత లేదని తెలిపారు. రోగులు అధైర్యపడొద్దని కోరారు. ప్రతి 100 మందిలో 98 మంది కరోనా రోగులు సంపూర్ణంగా కోలుకుంటున్నారని ఎవరూ భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment