న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కుల వివరాలను ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఈ మార్కుల ఆధారంగా ప్రైవేటు సంస్థలు కూడా నియామకాలు చేపట్టడానికి తోడ్పడుతుందని పేర్కొంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో తుది ఇంటర్వూ్య వరకు వెళ్లిన అభ్యర్థుల విద్యార్హతతోపాటు ఈ పోటీ పరీక్షలో సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు.
తద్వారా అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని ప్రైవేటు సంస్థలు గుర్తించి వారికి ఉపాధి కల్పిస్తాయని యూపీఎస్సీ పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు వీరి సమాచారాన్ని అనుసంధానం చేసేలా అంతర్గత సమాచార వ్యవస్థతో కూడిన వెబ్‌సైట్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేస్తోంది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేపుడు అభ్యర్థులు తమ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలపాల్సి ఉంటుంది.