దూరం 250 కిమీ.. టికెట్‌ ధర 12వేలు | UPSRTC To Charge 10,000 To 250 KM | Sakshi
Sakshi News home page

దూరం 250 కిమీ.. టికెట్‌ ధర 12వేలు

Published Thu, May 14 2020 11:01 AM | Last Updated on Thu, May 14 2020 4:22 PM

UPSRTC To Charge 10,000 To 250 KM - Sakshi

లక్నో : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస జీవుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. స్వస్థలానికి వెళ్దాం అనుకుంటే రవాణా సదుపాయంలేక, ఒకవేళ వాహనాలు ఉన్నా భారీగా పెరిగిన ప్రయాణ చార్జీలను చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కూలీలకు అసరాగా ఉండాల్సిన ప్రభుత్వం నిలువునా దోచుకుంటోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే వలస కూలీల తరలింపు సౌకర్యార్థం యూపీఎస్‌ ఆర్టీసీ (ఉత్తరప్రదేశ్‌ రోడ్డు రవాణాసంస్థ) పలు వాహనాలను నడుపుతోంది. దీంతో దొరికిందే అదునుగా భావించిన యూపీ సర్కార్‌ వలస కూలీల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణ ఖర్చులను రాబడుతోంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్టు- నోయిడా- ఘజియాబాద్‌ మధ్య దూరం 250 కిలో మీటర్లు. వీటి మధ్య ప్రయాణానికి ఏకంగా రూ.12 వేలు చార్జీగా నిర్ణయించారు. అంతేకాకుండా దూరాన్ని బట్టి ప్రతి కిలో మీటర్‌కు రూ. 50 అదనపు చార్జీలను కూడా కూలీల నుంచి వసూలు చేస్తున్నారు. (24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు)

అదే ఎసీ సౌకర్యం ఉన్న వాహనాల్లో మరికొంత ఎక్కువగా ధరలు పెంచారు. దీనిపై యూపీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ శేఖర్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ నేపథ్యంలో 45 మంది ప్రయాణం సామర్థ్యం ఉండే బస్సుల్లో కేవలం 26 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం. వైరస్‌ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రం తరిలిస్తున్నాం. ప్రయాణికులు సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సాధారణంగానే టికెట్‌ చార్జీలను పెంచాం. ఆర్టీసీ బస్సులతో పాటు టాక్సీలను కూడా అందుబాటులో ఉంచాం. వాహనాన్ని బట్టి టికెట్‌ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. 250 కిలో మీటర్ల ప్రయాణానికి బస్సు చార్జీ రూ. 10వేలు, ఎస్‌యూవీ వాహనానికి రూ. 12 వేలు వసూలు చేయబడుతుంది. తాజాగా నిర్ణయించిన ధరల అమలుకు ప్రభుత్వం ఇదివరకే జీవో జారీ చేసింది.’ అని వెల్లడించారు. అధిక ధరలపై వలస కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. తప్పని పరిస్థితిలో చెల్లించాల్సి వస్తోంది. (మద్యం తరలిస్తున్న ఎమ్మెల్యే.. కారు సీజ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement