లక్నో : తన చావుకు లాక్‌డౌన్ పొడిగింపే కారణమంటూ ఒక వ్యక్తి సూసైడ్ నోట్ రాసి పెట్టి శుక్రవానం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహజన్‌పూర్ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ గుప్తా హోటల్‌లో పనిచేస్తుండేవాడు. భార్య, నలుగురు పిల్లలు, తల్లితో కలిసి గుప్తా అక్కడే ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో అతని గుప్తా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ విధించిన మొదటిరోజుల్లో ఎలాగోలా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇంతలోనే తల్లి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. కాగా కరోనా మహమ్మారి దేశంలో మరింత విజృంభిస్తుండడంతో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భానుప్రకాశ్ కష్టాలు రెట్టింపయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబపోషణ భారమైపోయింది. దిక్కులేని స్థితిలో ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించాడు. శుక్రవారం సాయంత్రం లఖింపూర్ ఖేరి జిల్లా రైల్వే స్టేషన్‌కు చేరుకొని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. (కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?)
భానుప్రకాశ్ రాసిన సూసైడ్ నోట్‌లో.. ' లాక్‌డౌన్ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం మాకు రేషన్ కోటా కింద గోధుమలు, బియ్యం మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం సాయం చేసినందుకు కృతజ్ఞతలు.. కానీ వారు చేసిన సాయం నా కుటుంబానికి సరిపోదు. ఇంట్లోకి కావలసిన పాలు, పెరుగు, ఉప్పు లాంటి నిత్యావసరాలు కొనడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. సరిగ్గా ఇదే సమయంలో నా తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆమెకు చికిత్సనందించేందుకు డబ్బులు కూడా లేవు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దగ్గర వాపోయినా వారు పట్టించుకోలేదు. అందుకే ఆత్యహత్యే శరణ్యమని భావించా' అంటూ పేర్కొన్నాడు.('చైనా ఉత్పత్తులను నిషేదిద్దాం')
ఇదే విషయమై లఖింపూర్ ఖేరీ జిల్లా మెజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ' భానుప్రకాశ్ ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక విచారణను పూర్తి చేశాం. లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేక ఇంట్లోనే ఉంటున్న భాను కుటుంబానికి రేషన్ కోటా కింద తగినంత సరుకులు అందించాం. భాను చనిపోయిన చోట మాకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలపై ఇన్విస్టిగేషన్‌ను ముమ్మరం చేస్తాము'.
కాంగ్రెస్ నేత ప్రియంక గాంధీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ' ఇది నిజంగా దురదృష్టకర సంఘటన. యూపీకి చెందిన భాను గుప్తా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం నన్ను కలచివేసింది. లాక్‌డౌన్ వల్ల అతని పని ఆగిపోయింది. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయనకు ప్రభుత్వం నుంచి రేషన్ మాత్రమే వచ్చింది. కానీ అతని లేఖలో ఇతర వస్తువులను కొనడానికి డబ్బులేవని రాశాడు. ఇతర అవసరాలు కూడా ఉన్నాయి. దేశంలో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఎంతో మంది లేఖలు రాశారు. కానీ భాను గుప్తా సూసైడ్ నోట్ మాత్రం ఆయనకు చేరదనుకుంటా. కానీ దయచేసి గుప్తా రాసిన లేఖను చదవి అతని కుటుంబానికి న్యాయం చేయండి' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment