లక్నో: వలస కార్మికులతో వెళుతున్న శ్రామిక్ ప్రత్యేక రైలులో మృతదేహం వెలుగు చూసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రైల్వే శాఖ ఎస్పీ సుమిత్రా యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బతుకు దెరువు కోసం వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు శనివారం సాయంత్రం గుజరాత్‌లోని ధోలా ప్రాంతం నుంచి శ్రామిక్ రైలు లక్నోకు బయలు దేరింది. ముందుగా అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారు. అయితే రైలు లక్నోకు చేరిన తర్వాత వలస కూలీలందరూ దిగి వెళ్లిపోగా ముప్పై యేళ్ల వ్యక్తి మాత్రం అందులోనే ఉండిపోయాడు. (సీతమ్మ కష్టం తీరింది)
అతడు అచేతన స్థితిలో ఉండటం గమనించిన అధికారులు వెంటనే బలరాంపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడిని యూపీలోని సీతాపూర్ జిల్లాకు చెందిన కన్హయ్యగా గుర్తించారు. అతడి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేయగా నేడు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. దీనిపై ఎస్పీ సుమిత్రా యాదవ్ మాట్లాడుతూ అతని ఆరోగ్య పరిస్థితి తోటి కార్మికులెవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. (స్వస్థలాలకు పంపండి.. మహాప్రభో!)
Comments
Please login to add a commentAdd a comment