ఓ చిన్న ప్రశ్న.. మీకు ఎక్కాలు వచ్చా? ఎన్నో ఎక్కం వరకు టకటకా చెప్పగలరు..? 20 వరకు.. పోనీ 30.. మీరు గణితమేధావి అయితే 999వ ఎక్కం వరకు చెబుతారేమో. మరి 20 కోట్ల ఎక్కాలు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తే.. ఎనిమిదో తరగతిలోనే ఈ ఫీట్‌ను చాలా సులువుగా చేసేస్తే.. ఆ బుడతడి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి..
సాక్షి, షహరన్‌పూర్: ఉత్తర ప్రదేశ్‌లోని షహరన్‌పూర్ జిల్లాలో నాకుడ్ త్రిపుడి గ్రామానికి చెందిన 12 ఏండ్ల పిల్లాడు చిరాగ్ రాఠీ. స్థానికంగా ఉన్న జిలాసింగ్ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లాణ్ని ఇప్పుడంతా మ్యాథ్స్ లెజెండ్ శకుంతలా దేవితో పోలుస్తున్నారు. ఎందుకంటే.. 20 కోట్ల రేంజ్‌లో ఉన్న ఏ నెంబర్స్‌కైనా గుణకారం, తీసివేత, కూడిక ఇట్టే చెప్పేస్తాడు. మనోడి టాలెంట్‌ను గుర్తించిన స్కూల్ యాజమాన్యం.. చిరాగ్ కోసం సపరేట్‌గా ఓ మ్యాథ్స్ టీచర్‌నే అపాయింట్ చేసిందట. ఎనిమిదో తరగతిలోనే 12వ తరగతి లెక్కలను అలా నోటిమీదే చేసి చెప్పేస్తున్నాడట.
సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదంటారు. చిరాగ్ విషయంలో కూడా అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరాగ్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతే. ఇది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం.. చిరాగ్‌కు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు ఫ్రీగా బుక్స్ కూడా ఇస్తోంది.
ఇవన్నీ సరే.. అసలు ఈ లెక్కలన్నీ ఇంత ఫాస్ట్‌గా ఎలా చేస్తున్నావు అని చిరాగ్‌ను అడిగితే.. ‘చాలామంది అంటుంటారు ఏదో ట్రిక్ ఉందని.. కానీ ఆన్సర్స్ నాకు సహజయంగానే వచ్చేస్తాయ’ని చెబుతున్నాడు. మరి పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే.. సైంటిస్టునవుతానని, ప్రధానిని, ముఖ్యమంత్రిని ఊరికి ఆహ్వానిస్తానని చెబుతున్నాడు.
‘ఆరో తరగతిలోనే అతని ప్రతిభను గుర్తించాం. టీచర్ల కంటే ఫాస్ట్‌గా లెక్కలు చేస్తుండడాన్ని గమనించాం. మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతనికోసం ప్రత్యేకంగా లెక్కల మాస్టార్‌ను అపాయింట్ చేశాం.’
– ప్రిన్సిపాల్ విశ్వాస్ కుమార్
‘సైంటిస్టు కావాలనేది నా కొడుకు కోరిక. దేశానికి మంచి పేరు తెస్తే చాలు. వాడి లక్ష్యం నెరవేరడానికి ఏం చేయడానికైనా మేం సిద్ధమే. చివరకు కిడ్నీ అమ్మి అయినా నా కొడుకును సైంటిస్టు చేస్తా’
– చిరాగ్ తండ్రి నరేంద్ర
Comments
Please login to add a commentAdd a comment