స్లిప్ పట్టు.. దర్జాగా కాపీ కొట్టు!
మథుర: ప్రస్తుతం పరీక్షల సీజన్ కదా.. కానీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కంటే వారి స్నేహితులు, బంధువులే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. అదేంటి, ఇందులో మతలబు ఏముందనుకుంటున్నారా... ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, విద్యార్థుల స్నేహితులు తమ పనులల్లో చాలా బిజీగా ఉన్నారు. వీరికి ఎగ్జామ్స్ అయితే, విద్యార్థుల స్నేహితులకు అసలు పరీక్షలు మొదలైనట్లు పరిస్థితి ఉంది. యూపీలోని మథురలో మాస్ కాపీయింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. అబ్బాయిలే కాపీరాయుళ్లు అని చెప్పడం ఇక నుంచి మరిచిపోవాల్సిందే. అమ్మాయిలు కూడా కాపీ కొట్టడంలో తమ సత్తా నిరూపించుకునేందుకు చేసే యత్నాలను మనం గమనించవచ్చు. మథురలో ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థినులు హాలు నుంచి బయటికి వచ్చి ప్రశ్నలను లీక్ చేయడం, ఆ వెంటనే వారి మిత్రులు స్లిప్స్ ను గాల్లోకి విసరటం వాటిని ఒడిసిపట్టడం చూడవచ్చు.
గతంలో బిహార్ లో బోర్డు పరీక్షలలో జరిగిన మాస్ కాపీయింగ్ ప్రస్తుతం యూపీలో రిపీట్ అవుతోంది. విద్యార్థులు ఎంచక్కా ఎగ్జామ్ హాలు నుంచి బయటకు వచ్చి క్వచ్చన్ పేపర్ లీక్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతేడాది బీహార్ లో ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఈ మాస్ కాపీయింగ్ పై దుమారం రేగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టి ప్రభుత్వంపై ఒత్తిని తీవ్రతరం చేశారు. అయితే అలాంటిదేమీ లేదని.. పరీక్ష హాలులో ప్రశ్న, జవాబు పత్రాలు తప్ప చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదని బీహార్ సీఎం నితిశ్ కుమార్ అప్పట్లో స్పష్టం చేసినా, వాస్తవాలు ఏంటన్నది అప్పుడు అందరూ చూశారు.