ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు.. | Video: Lie Down Steal, Repeat. Meet Mathura Station Sleeping Thief | Sakshi
Sakshi News home page

ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..

Published Wed, Apr 10 2024 9:08 PM | Last Updated on Wed, Apr 10 2024 9:17 PM

Video: Lie Down Steal, Repeat. Meet Mathura Station Sleeping Thief - Sakshi

లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు.  రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్‌లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు.

తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్‌ జేబులోని మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్‌ రూమ్‌ నుంచి జారుకున్నాడు.

మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఐదు మొబైల్‌ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement