డెహ్రడూన్ : వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఔలీ ప్రాంతంలో జరిగిన ఓ కుబేరుడి వివాహ వేడుక మున్సిపాలిటీ అధికారులకు సమస్యలు తెచ్చి పెట్టింది. భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో చెత్త కూడా అంతే మొత్తంలో పొగయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చెత్తను తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది తల పట్టుకుంటున్నారు.
వివరాలు.. భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. అనేక వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో బిలియనీర్ అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్ వివాహం జూన్ 18-20 మధ్య, అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ వివాహం జూన్ 20-22 మధ్య జరిగింది. గ్రాండ్‌గా నిర్వహించిన ఈ వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ నటులు, యోగా గురు బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి వేడుకల కోసం గుప్తా కుటుంబం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను బుక్ చేసుకుంది. దాదాపు రూ. 200కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహాం జరిపించారు. అయితే, ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. గుప్తాల వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు. ‘ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయి. పశువులు మేత కోసం ప్రతి రోజు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఒకవేళ అవి ఈ ప్లాస్టిక్‌ను తింటే ఏంటి పరిస్థితి.. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తార’ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment