బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నుంచి 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్' అవార్డును (వాజపేయి తరఫున) స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఢాకా: 'ఆయనొక ఆదర్శం. నేనే కాదు.. చాలామంది ఆయనలా ఉండాలని కోరుకుంటారనడంలో సందేహంలేదు. నిజానికి ఆయన ఇక్కడికి వచ్చుంటే.. ఈ వేడుక మరోలా.. మరింత అద్భుతంగా జరిగిఉండేది' అని మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారీ వాజపేయిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారం 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్' అవార్డును ఆయన తరఫున మోదీ స్వీకరించారు.
బంగ్లా అధ్యక్ష నివాసం 'బంగబందు భవన్'లో ఆదివారం కన్నుల పవండువగా జరిగింది. బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ 'లిబరేషన్ వార్' అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షేక్ హసీనాతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంట విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ కూడా ఉన్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఢాకాలో నూతనంగా నిర్మించిన భారతీయ హై కమిషనర్ కార్యాలయంతోపాటు భారత్ ఆర్థిక సహాయంతో చేపట్టిన ఆరు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇండియా- బంగ్లాదేశ్ మైత్రి గర్ల్స్ హాస్టల్, విక్టోరియా కాలేజ్, అంధ విద్యార్థుల కోసం భవంతి నిర్మాణం, పునరావాస కేంద్రం, మురుగు శుద్ధి కేంద్రం తదితరాలు భారత సహాయంతో నెలకొల్పినవే కావడం విశేషం. ఉదయం ఢాకేశ్వరీ ఆలయాన్ని సందర్శించి రెండోరోజు పర్యటనను ప్రారంభించిన మోదీ.. రామకృష్ణ మఠానికి కూడా వెళ్లి ప్రధాన గురువులతో భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాతోనూ ఆయన సమావేశమవుతారు.