న్యూఢిల్లీ: సాంకేతికతను సాధికారత సాధించేందుకే సద్వినియోగం చేయాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సాంకేతికత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత్ పోఖ్రాన్ అణపరీక్షలు జరిపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ దేశ చరిత్రలో ఉజ్వలమైన క్షణాల్లో 1998నాటి పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా ఒకటి.
వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నకాలంలో చేసిన అణుపరీక్షలు దేశ శాస్త్రసాంకేతికత సత్తాను చాటడంతోపాటు ప్రపంచస్థాయిలో దేశ ఖ్యాతిని సమున్నత స్థాయిలో నిలిపాయి’ అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్వరలో నిర్మంచబోయే లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా(లిగో–ఇండియా)కు శంకుస్థాపన చేసిన దానిని జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అరుదైన ఖనిజాల నుంచి మ్యాగ్నెట్‌లను తయారుచేయనున్నారు.
విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనాలయంసహా ముంబై, నవీ ముంబైలలోని పలు పరిశోధన, ఉత్పత్తి కేంద్రాలను జాతికి అంకితమిచ్చారు. ‘ జామ్(జేఏఎం) ట్రినిటీ, కోవిన్ పోర్టల్, రైతులకు డిజిటల్ మార్కెట్ ఇలా ప్రతి రంగంలో సాంకేతికతను భారత ప్రభుత్వం సాధికారత, సామాజిక న్యాయం కోసమే వినియోగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కాదు. శాస్త్ర,సాంకేతిక రంగ పురోభివృద్ధికి ఎంతగానో మా సర్కార్ కృషిచేస్తోంది. పదేళ్ల క్రితం ఏటా 4,000 పేటెంట్లు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30వేలకు చేరుకుంది. గతంలో ఏటా 70వేల ట్రేడ్‌మార్క్‌లు నమోదయ్యేవి. ఇప్పుడవి 2.5లక్షలపైమాటే. ఇంక్యుబేషన్ కేంద్రాల సంఖ్య ఎనిమిదేళ్ల క్రితం 150 ఉంటే ఇప్పడవి 650కి చేరుకున్నాయి’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment