
ప్రముఖ జర్నలిస్ట్ వర్గీస్ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87), మంగళవారం గుర్గావ్‌లో అస్వస్థతతో మరణించారు.
గుర్గావ్: ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87), మంగళవారం గుర్గావ్‌లో అస్వస్థతతో మరణించారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు. వర్గీస్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్టు నెల కిందట డాక్టర్లు నిర్ధారించారు. రెండు వారాలుగా జ్వరం, శారీరక బలహీనతతో బాధపడుతున్న వర్గీస్ క్రమంగా వ్యాధినిరోధక శక్తి క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వర్గీస్‌కు భార్య జమీలా, కుమారులు విజయ్, రాహుల్ ఉన్నారు.
వర్గీస్ అంత్యక్రియలు గురువారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వర్గీస్ 1966 నుంచి 1969 వరకూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచార వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించారు. అయితే, 1975లో ఇందిర అత్యయిక పరిస్థితి విధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. పౌరహక్కుల రక్షణకోసం ఆయన ఎంతో కృషిచేశారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై ఏర్పాటైన ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ సంఘంలో సభ్యుడుగా ఉన్నారు. ‘వాటర్స్ ఆఫ్ హోప్’, ‘ఇండియాస్ నార్త్ ఈస్ట్’ ‘ఫోర్త్ ఎస్టేట్(2005)’ వంటి పుస్తకాలు రాశారు. కాగా, వర్గీస్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.