న్యూఢిల్లీ: కళాకారులను హింసాత్మక రీతిలో బెదిరించడం, వారిపై భౌతిక దాడులు చేసిన వారికి నగదు బహుమతులిస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదనీయం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘సినిమాలపై నిరసన తెలపడంలో భాగంగా కొందరు వ్యక్తులు కళాకారులపై భౌతిక హింసకు పాల్పడిన వారికి రూ.కోటి బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తున్నారు.
ముందు అలాంటి వాళ్ల దగ్గర అసలు కోటి రూపాయలు ఉంటుందో లేదోనని నాకు అనుమానం? నిరసన తెలపాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకానీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో తగదు’ అని అన్నారు. ప్రత్యేకించి ఏ సినిమా గురించి వెంకయ్య ప్రస్తావించకపోయినప్పటికీ, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఎన్నిరోజులు పనిచేసిందన్నదే ముఖ్యం....
పార్లమెంటు సమావేశాలకు ప్రభుత్వం చాలా తక్కువ సమయం కేటాయించిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తున్న సందర్భంలో వెంకయ్య మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయన్నది ముఖ్యం కాదు. ఎన్ని రోజులు సభ పనిచేసిందన్నది ప్రధానం’ అని అన్నారు. సాహిత్యం సమాజానికి వెన్నెముకనీ, కాళిదాసు కాలం నుంచి నేటి వరకు ఎందరో కవులు, రచయితలు, మేధావులు భారతీయ సంప్రదాయాల్ని తమ రచనల్లో ప్రతిబింబించారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment